దసరా బొనాంజా!

దసరా బొనాంజా! - Sakshi


* ‘నామినేటెడ్’ భర్తీకి కేసీఆర్ నిర్ణయం

* తొలుత మార్కెట్, దేవాదాయ కమిటీల నియామకం.. ఆ తర్వాత పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీల ఏర్పాటు

* నియోజకవర్గ కేంద్రాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన

* టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో నిర్ణయాలు

* పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సభ్యులకు వివరించిన సీఎం కేసీఆర్


 

సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్‌ఎస్ నాయకులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు దసరా బంపర్ ఆఫర్ ప్రకటించారు. మార్కెట్ కమిటీలు, దేవాదాయ కమిటీలు, గ్రంథాలయ సంస్థలకు పాలక మండళ్ల నియామకాన్ని దసరాలోపు పూర్తిచేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. సుమారు గంటకు పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ క్షేత్ర స్థాయి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ వివరించారు.

 

 అనంతరం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పార్టీ పటిష్టానికి చేయాల్సిన కృషిపై సమావేశంలో చర్చ జరిగిందని... దసరాలోగా వివిధ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని మంత్రి నాయిని వెల్లడించారు. పార్టీ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీల నియామకంపై దసరా తర్వాత మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. 42 మందితో అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. పోరాటాలు చేసిన వారిని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని మరువకుండా... కొత్త, పాత కలయికతో కమిటీలు ఉండాలని సూచించినట్లు చెప్పారు. పార్టీని పటిష్టం చేసే దిశగా ఎమ్మెల్యేలు పనిచేయాలని.. దసరాలోపు కమిటీల జాబితాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ఆయా శాఖల మంత్రులు జాబితాలను సమీక్షించాక నామినేటెడ్ పదవుల భర్తీని పూర్తి చేయనున్నట్లు నాయిని తెలిపారు. గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష, లోపాలుంటే సవరించే బాధ్యతను మంత్రులకు అప్పజెప్పారన్నారు. దసరా పండుగ రోజునే ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో అక్కడి ఎమ్మెల్యేలు డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీకి శంకుస్థాపన చేయాలని, కచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.

 

 పక్కాగా పనులు..

 ఎన్నికల మేనిఫెస్టోను పక్కాగా అమలు చేయాలని, మిషన్ కాకతీయలో పెండింగ్ పనులతో పాటు కొత్త పనులను చేపట్టాలని సీఎం సూచించారని నాయిని తెలిపారు.  వాటర్ గ్రిడ్ పథకం పనులను ప్రతీ ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించాలని, పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారని చెప్పారు. భూసేకరణలో ఇబ్బందులు తలెత్తితే ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని పరిష్కారంలో అధికారులకు సహకరించాలని ఆదేశించినట్లు చెప్పారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని ఏడాదిలోపే వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాలకు ఇచ్చే అవకాశం ఉందని సీఎం వివరించారని మంత్రి తెలిపారు.

 

 అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా చేరేలా చూడాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఉందని సీఎం పేర్కొన్నారని మంత్రి జగ దీశ్‌రెడ్డి చెప్పారు. మిషన్ కాకతీయలో 20 శాతం పరిమితిని ఎత్తివేసి ఈసారి ఎన్ని కావాలంటే అన్ని పనులు చేసుకునే వెసులుబాటు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారని చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పనులు పూర్తయిన చెరువుల్లో మత్స్యకార సొసైటీలకు సీడ్ అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

 కడియం డుమ్మా

 టీఆర్‌ఎస్ ఎల్పీ భేటీకి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరుకాలేదు. ఈ భేటీకి ఆయన రాకపోవడానికి బలమైన కారణమే ఉందని సమాచారం. ఉప ఎన్నిక జరుగనున్న వరంగల్ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మాజీ డి ప్యూటీ సీఎం టి.రాజయ్య కుటుంబం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నారని, ఇంటెలిజెన్స్‌తో రాజయ్య భార్య ఫాతిమా మేరీ గురించి సీఎం ఎంక్వైరీ చేయించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టి.రాజయ్యకు మళ్లీ ప్రాధాన్యమిస్తున్నారన్న భావనతో కడియం అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే టీఆర్ ఎస్ ఎల్పీ భేటీకి రాకుండా నిరసన తెలిపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జ్వరం రావడం వల్లే కడియం టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీకి రాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top