మూడేళ్లలో 73 ప్రాజెక్టులు


శ్రీసిటీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా పారిశ్రామిక రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా తమ ప్రభుత్వం గడచిన మూడేళ్లలో 1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చే 73 మెగా ప్రాజెక్టులను ఆమోదించిందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. తద్వారా లక్షా యాభైవేల మందికి ఉద్యోగాలొచ్చాయన్నారు. బుధవారమిక్కడి చిత్తూరు జిల్లా శ్రీసిటీ పారిశ్రామిక వాడలో ఇప్పటికే ఏర్పాటై కార్యకలాపాలు మొదలుపెట్టిన 13 యూనిట్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ 13 యూనిట్లూ ఇప్పటిదాకా రూ.1,200 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి.

 

 వీటితో పాటు రూ.వెయ్యి కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులతో రానున్న 10 కంపెనీలు సైతం బుధవారం ముఖ్యమంత్రి సమక్షంలో భూమిపూజ చేశాయి. పారిశ్రామిక రంగం వృద్ధి చెందితేనే ఉద్యోగాలొస్తాయంటూ... రాష్ట్రంలో జహీరాబాద్, ఒంగోలు, చిత్తూరులో మూడు తయారీ పారిశ్రామిక వాడలు (ఎన్‌ఐఎంజెడ్) రానున్నాయని సీఎం తెలియజేశారు. ఇసుజు, పెప్సీ, క్యాడ్‌బరీ వంటి దిగ్గజాలు శ్రీసిటీని ఎంచుకోవటం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. దుగ్గరాజపట్నం పోర్టుకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నామని, తద్వారా చెన్నై-బెంగళూరు కారిడార్ మరింత పారిశ్రామిక పురోగతి సాధిస్తుందని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర పరిశ్రమలు ఎదుర్కొన్న విద్యుత్తు సంక్షోభాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. శ్రీసిటీలోని పరిశ్రమలకు మున్ముందు అలాంటి పరిస్థితి రాకుండా చూస్తానని, నూరుశాతం విద్యుత్తు సరఫరా చేస్తామని హామీనిచ్చారు. అంతకుముందు మాట్లాడిన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర... పారిశ్రామిక రంగంలో వందేళ్ల ముందున్న రాష్ట్రాలతో సైతం పోటీపడి మన రాష్ట్రం పలు ప్రాజెక్టులను దక్కించుకుందని తెలియజేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top