‘ఛత్తీస్’ గండమే!


సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారడం ఖాయమని విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ, రాజకీయేతర పక్షాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. కనీస ధర నిర్ధారించకుండా నేరుగా ఒప్పందం ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఛత్తీస్‌గఢ్ డిస్కంలతో రాష్ట్ర డిస్కంలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆమోదించవద్దని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మం డలి(ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై గురువారం ఈఆర్సీ ఇక్కడ బహిరంగ విచారణ నిర్వహించింది.  అభిప్రాయ సేకరణ సాయంత్రం 4 వరకు సుదీర్ఘంగా సాగింది.

 

వేల కోట్ల భారం..


ఈ విద్యుత్ ఒప్పందం ద్వారా రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారం పడుతుందని విద్యుత్ జేఏసీ కన్వీనర్ కె.రఘు అభిప్రాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం, ట్రాన్స్‌మిషన్ ఖర్చులు, పన్నుల ఆధారంగా లెక్కిస్తే... అక్కడి విద్యుత్ ధర యూనిట్‌కు రూ.5.50-రూ.5.75 వరకు ఉంటుందన్నారు. అదే టెండర్ల ద్వారా ఇటీవల యూనిట్‌కు ఏపీ డిస్కంలు రూ.4.23కు, తెలంగాణ డిస్కంలు రూ.4.15కే కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.



ఈ లెక్కన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.1.50 వరకు అదనపు భారం పడుతుం దన్నారు. అంటే ఏడాదికి రూ.1,050 కోట్ల చొప్పున 12 ఏళ్లలో రూ.12,600 కోట్ల అదనపు భారం పడుతుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 1000 మెగావాట్ల కంటే తక్కువ కొనుగోలు చేసినా.. అసలే కొనకపోయినా పూర్తిగా వెయ్యి మెగావాట్లకు స్థిరచార్జీల చెల్లింపునకు అంగీకరించడంతో వందల కోట్ల భారం పడుతుందని రఘుతోపాటు ఇతర పిటిషనర్లు తిమ్మారెడ్డి, ఎం.వేణుగోపాలరావు ఆందోళన వ్యక్తం చేశారు.



నిర్మాణంలో ఉన్న వార్దా (మహారాష్ట్ర)-మహేశ్వరం (హైదరాబాద్) విద్యుత్ కారిడార్‌లో రాష్ట్రానికి లభించనున్న లైన్ల సామర్థ్యం మేరకే ఛత్తీస్‌గఢ్‌కు స్థిరచార్జీలు చెల్లిస్తామని సీఎండీ రఘుమారెడ్డి వివరించారు. ట్రాన్స్‌మిషన్ చార్జీలు, పన్నులను సైతం తెలంగాణ డిస్కంలపై వేయడం తగదని తిమ్మారెడ్డి పేర్కొనగా ఈఆర్సీ విభేదించింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వల్ల రాష్ట్రం లో విద్యుత్‌చార్జీలు పెరిగిపోతాయని, బషీర్‌బాగ్ తరహాలో విద్యుత్ ఉద్యమాలు పునరావృతం అవుతాయని సీపీఐ రాష్ట్ర నేత వి.రామనరసింహరావు ఆందోళన వ్యక్తం చేశారు.



రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆమోదించాలని విద్యుత్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. చివరగా సీఎండీ రఘుమారెడ్డి కొన్ని అభ్యంతరాలపై వివరణలు ఇచ్చారు.  ఈ ఒప్పందం ముసాయిదా మాత్రమేనని, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ తెలిపారు.

 

ఛత్తీస్‌గఢ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి: సీపీఎం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు భారంగా పరిణమించనున్న ‘ఛత్తీస్‌గఢ్’ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈఆర్సీ ప్రజాభిప్రాయసేకరణ ప్రహసనంగా మారిందని ఆయన విమర్శించారు.

 

చర్చను అడ్డుకోవడంపై సందేహాలు: కోదండరాం

రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఒప్పందం మంచిదేనని.. అయినా అందులోనూ లోపాలుండే అవకాశా లు ఉన్నాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. అలాంటప్పుడు స్వేచ్ఛాయేతర వాతావరణంలో చర్చలు అవసరమని... ఆ చర్చలతో వచ్చే సమష్టి అభిప్రాయంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు. చర్చలో పాల్గొనకుండా ప్రభుత్వం ఎవరిని అడ్డుకున్నా అనుమానాలు, అపోహలు రేకెత్తుతాయన్నారు. అభ్యం తరాలను పట్టించుకోకుండా ఒప్పందాన్ని ఆమోదిస్తే విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top