మోదీకి బకరా వెంకయ్య: నారాయణ

మోదీకి బకరా వెంకయ్య: నారాయణ - Sakshi


తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను తెలియజెప్పకుండా, ఢిల్లీ ఏం చెబితే దానికి తలూపుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్రమోదీకి బకరాగా మారారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం సీపీఐ రూపొందించిన ప్రజా బ్యాలెట్ ను శనివారం తిరుపతిలో ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయలేకే బీజేపీ ప్యాకేజీ అంశాన్ని ముందుకు తెచ్చిందని అన్నారు.



'ఎన్నికల సమయంలో ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా బీజేపీతోనే సాధ్యమవుతుందని సన్మానాలు చేసుకుని, ఓట్లు అడుక్కున్న వెంకయ్య నాయుడు.. ఇప్పుడు హోదాతో ఉపయోగం లేదని చెప్పడం సిగ్గుచేటు. ఆయనలా మాట మార్చినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రూ.2.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తామని చెబుతున్న వెంకయ్యకు.. ఆ మొత్తాన్ని 2019లోపు ఇచ్చేస్తామని ప్రకటించే ధైర్యం ఉందా?'అని నారాయణ ప్రశ్నించారు. వచ్చే పదేళ్లనాటికి వెంకయ్యగానీ, బీజేపీగానీ అధికారంలో ఉంటారో ఊడతారో తెలియని పక్షంతో ఇలాంటి తప్పుడు వాగ్ధానాలిచ్చి ప్రజలను మోసం చేయడం దారుణమన్నారు. గొప్ప ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు వెంకయ్య నాయుడు సిద్ధంగా వుండాలని హెచ్చరించారు. ప్రత్యేక హోదా అడగలేక కేంద్రం ప్రకటనలను స్వాగతించే దౌర్భాగ్య స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండడం దురదృష్టకరమన్నారు. బీజేపీ, టీడీపీలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top