ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే

ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే - Sakshi


కరీంనగర్: ప్రభుత్వ భూములను పేదలకు పంచే వరకు ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని, భూమి లేని నిరుపేదలకు భూములు పంచకుంటే పతనం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు భూమి లేని దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని, అధికారంలోకి వచ్చాక కాకి లెక్కలతో కాలయాపన చేయడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు మంగళవారం నుంచే భూపోరాటాలకు శ్రీకారం చుట్టామని, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని అన్నారు.



కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి బడా బాబులు బీనామీల పేరిట పట్టాలు సృష్టించుకొని సాగులో ఉన్నారని, గ్రామంలో ఉన్న పేదలతో ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు పోరాటం మొదలుపెట్టామని ఆయన  వెల్లడించారు. భూసంస్కరణల చట్టాన్ని అమలు చేయకుండా, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కుతూ వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు నామమాత్రపు రేటుతో కట్టబెడుతున్న ప్రభుత్వ తీరుపై ప్రజలు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో రెండువేల మంది పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే పోలీసులు లాఠీచార్జి చేసి గుడిసెలు ఖాళీ చేయించడం అప్రజాస్వామికమన్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తన వైఖరి స్పష్టం చేయాలని చాడ వెంకటరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top