లీకేజీపై సర్కార్‌ దొంగాట

లీకేజీపై సర్కార్‌ దొంగాట - Sakshi


టెన్త్‌ ప్రశ్నపత్రాల లీకేజీపై పచ్చి అబద్ధాలు

నారాయణ, గంటా, చంద్రబాబు విరుద్ధ ప్రకటనలు

కప్పదాట్లు.. గడియకో సమాధానం..

ఆధారాలున్నాయి... చూపిస్తానంటున్నా జగన్‌ను పట్టించుకోని స్పీకర్‌

ప్రతిపక్షనేతకు రెండు నిమిషాలు కూడా మైక్‌ ఇవ్వని వైనం..

లీకేజీపై 30న సీఎం ప్రకటన చేస్తారని చెప్పిన యనమల, కోడెల

షెడ్యూలులో లేని బిల్లులు హడావిడిగా సభ ముందుకు..

ప్రతిపక్షం వాకౌట్‌ చేయగానే లీకేజీలపై సీఎం ప్రకటన..

ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడుతూ లీకేజీలపై మమ..

నారాయణను కాపాడేందుకు అడుగడుగునా తాపత్రయం..

ముఖ్యమంత్రి తొండి ప్రకటనలో ‘సాక్షి’పైనా అభాండాలు..




(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘పరీక్ష ప్రారంభం కాకముందే ప్రశ్నపత్రం బయటకు వస్తే అది లీకేజీ అవుతుంది. కానీ నెల్లూరులో పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత పేపర్‌ బయటకు వచ్చింది.’’

    – ఢిల్లీలో మంత్రి గంటా శ్రీనివాసరావు



‘‘అసలు ప్రశ్నాపత్రాల లీకేజీయే లేదు. లీకేజీ జరిగిన చోట నారాయణ విద్యార్థులు లేరు. ఇదంతా ఓ దుష్ప్రచారం.’’

    – అమరావతిలో మంత్రి నారాయణ



‘‘లీకేజీయే కానీ ఇది మాల్‌ప్రాక్టీస్‌ కిందకొస్తుంది. నెల్లూరులోని నారాయణ హైస్కూల్‌లో వాచ్‌మన్‌ ప్రవీణ్‌ ఈనెల 25న ఉదయం 9.25 గంటలకు సెల్‌ఫోన్‌ ద్వారా పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి వ్యాట్సప్‌లో పంపాడు.’’ (పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.)

    – అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు



లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న దొంగాటకు ప్రభుత్వంలోని ముగ్గురు కీలకమైన వ్యక్తులు చేసిన ఈ మూడు ప్రకటనలు అద్దం పడతాయి. ప్రశ్నాపత్రాల లీకేజీయే జరగలేదని ఒక మంత్రి, జరిగింది గానీ పరీక్ష ప్రారంభమైన తర్వాత జరిగిందని మరో మంత్రి, కాదు కాదు పరీక్ష ప్రారంభానికి ముందే పేపర్‌ లీకయ్యిందని ముఖ్యమంత్రి.. ఇలా ముగ్గురూ మూడు రకాల ప్రకటనలు చేసి సమస్యను తప్పుదోవ పట్టించడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మంగళవారం శాసనసభను స్తంభింపజేసింది. వాయిదాతీర్మానాన్ని అంగీ కరించకపోవడంతో  స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభ రెండుసార్లు వాయిదాపడింది.



దాదాపు మూడున్నర గంటల సేపు ఈ అంశంపై సభ దద్దరిల్లిపో యింది. ప్రభుత్వ పరీక్షల అధికారి ఇచ్చిన నివేదిక సహా తన వద్ద ఉన్న ఆధారాల గురించి వివరిస్తానని ప్రతిపక్షనేత వైఎస్‌జగన్‌  ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్‌ అనుమతించలేదు. ప్రశ్నప్రతాల లీకేజీలపై ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే అన్ని విషయాలూ బయటకొస్తా యని విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ వ్యాఖ్యానించారు.  సభలో ప్రతిపక్షం ఆందోళనలతో కంగుతిన్న అధికారపక్షం.. హడావిడిగా వేసిన ఎత్తుగడలు వికటించి చివరకు కన్నంలో చిక్కిన దొంగలా దొరికిపో యింది. గడియకో సమాధానం, కప్పదాట్లు చూసినవారికి ఈ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం తత్తరపాటు స్పష్టంగా అర్ధమైపో యింది. ఇందులో ఇద్దరు కీలక మంత్రులకు ప్రత్యక్షంగా ప్రమేయముండడం, అందులో ఒకరు సీఎంకు మరీ కావలసిన వ్యక్తి కావడంతో ప్రభుత్వం అదిరిపడింది. ఒక మంత్రిని కాపాడడం కోసం సీఎం సహా అందరూ అనేక రకాలుగా ప్రయత్నిస్తుం డడం చూసి జనం నివ్వెరపోతున్నారు. మంగళవా రం సభలోనూ, సభ వెలుపలా చోటుచేసుకు న్న పరిణామాలు ఓమారు గమనిస్తే...



ప్రతిపక్షనేతకు రెండు నిమిషాలివ్వలేదు...

ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య స్పీకర్‌ సభను రెండు సార్లు వాయిదావేశారు. విపక్షనేతకు మాట్లాడేందుకు రెండునిమిషా లు కూడా అవకాశం దక్కలేదు. అత్యంత ప్రాధాన్యత గలిగిన, లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కనీసం 344 నిబంధన కింద స్వల్పకాలిక చర్చకన్నా అనుమతివ్వాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ప్రభుత్వానికి పంపిన రోజువారీ నివేదికలో నెల్లూరులోని ‘నారాయణ’ హై స్కూల్‌ ప్రస్తావన ఉంది. ఆ స్కూల్‌ నుంచి పరీక్షాపత్రం లీకయినట్లుగా జిల్లా విద్యాశాఖాధికారి నుంచి వచ్చిన నివేదిక కూడా ఉంది. ఆ విషయాలనే సభకు వివరిస్తానని, తన వద్ద ఉన్న ఆధారాలను అందిస్తానని ప్రతిపక్షనేత పలుమార్లు విజ్ఞప్తి చేశారు.



ఈ దశలో చంద్రబాబు ఈనెల 30న ప్రశ్నపత్రాల లీకేజీపై ఒక ప్రకటన చేస్తారని ఆర్ధిక మంత్రి యనమల సభలో వెల్లడించారు. అదే విషయాన్ని స్పీకర్‌  పునరుద్ఘాటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ విషయాన్ని వదిలేసి షెడ్యూలులో లేని ద్రవ్య వినిమయ బిల్లు, 2013 భూసేకరణ చట్టం సవరణ బిల్లు, చుక్కల భూములకు సంబంధించిన బిల్లుతో పాటు ఇతర బిల్లులను ఈరోజే ఆమోదింప చేయాల్సి ఉందంటూ ప్రభుత్వం వితండ వాదానికి దిగింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే  ఏకపక్షంగా బిల్లులు ఆమోదింపచేసుకోవడంతో పాటు ద్రవ్యవినిమయ బిల్లునూ ప్రవేశపెట్టింది.



ముఖ్యమంత్రి ప్రకటన 30న అని చెప్పి..

ప్రశ్నాపత్రాల లీకేజీపై ముఖ్యమంత్రి 30న ప్రకటన చేస్తారని ఆర్థిక మంత్రి యనమల, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఇద్దరూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ లీకేజీ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రభుత్వం.. షెడ్యూలులో లేకపోయినా బిల్లులను ముందుకు తేవడం, ద్రవ్య వినిమయబిల్లునూ ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షం వాకౌట్‌ చేసింది. ప్రతిపక్షం లేకుండానే ద్రవ్యవినిమయబిల్లును మమ అనిపించేశారు. ద్రవ్యవినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టి సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పడం సభా సంప్రదాయం. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి  కల్పించుకొని దాదాపు గంటసేపు ప్రసంగించారు.



పనిలో పనిగా 30 న చేస్తామని చెప్పిన లీకేజీ ప్రకటనను సభలో చదివి ఇక ఆ అంశం ముగిసినట్లేనని అనిపించారు. లీకేజీలపై 30న సీఎం ప్రకటన ఉంటుందని అధికార పక్షం, స్పీకర్‌ చెప్పినా ప్రతిపక్షసభ్యులు వాకౌట్‌ చేసిన తర్వాత ముఖ్యమంత్రి లీకేజీలపై ప్రకటన చేయడంపైనా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. లీకేజీలపై ఆత్మరక్షణలో పడిపోయిన ప్రభుత్వం ఎలాగోలా గట్టెక్కడం కోసమే సభలో ప్రతిపక్షం లేని సమయంలో ప్రకటన చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక అంశంపై సభలో చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, దానిపై ఏవైనా వివరణలు ఉంటే సమాధానమివ్వడం సాంప్రదాయం. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇలా తప్పించుకునేటట్లుగా దొంగాట ఆడుతుండడం అనేక సందర్భాలలో బైటపడుతోంది. ఏ విషయమైనా ఏకపక్షంగా తామే మాట్లాడడం, ప్రతిపక్షానికి కనీసం మాట్లాడేందుకు మైక్‌ కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా గొంతునొక్కడం అడుగడుగునా కనిపిస్తోంది.



నారాయణను కాపాడాలన్న తాపత్రయం

మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు స్వయానా వియ్యంకుడు కావడం, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా నిధులు సమకూర్చిన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన్ను రక్షించేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నారని అర్ధమౌతోంది. మరోవైపు ఆయన చంద్రబాబు బినామీ అన్న వాదనలూ ఉన్నాయి.  ద్రవ్య వినిమయబిల్లుపై అకస్మాత్తుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రసంగించడం, ప్రశ్నాపత్రాల లీకేజీలపై 30న చేస్తారనుకున్న ప్రకటన ఈరోజే చేసేయడం చూస్తే ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రశ్నాపత్రాల లీకేజీ ప్రహసనంలో ఇరుక్కుపోయిన మంత్రి నారాయణను ఎలాగైనా రక్షించాలన్న తాపత్రయంతోనే ముఖ్యమంత్రి ముందే ప్రకటన చేశారని, ప్రతిపక్షానికి మరో అవకాశం లేకుండా చేయాలన్న ఎత్తుగడ ఇందులో ఇమిడి ఉందని విశ్లేషకులంటున్నారు.



ద్రవ్య వినిమయ బిల్లుపై నిబంధనలకు విరుద్ధంగా  సీఎం సుదీర్ఘ ప్రసంగం చేయడంతో  చివరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసేదేమీ లేక ‘‘శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై సీఎం మాట్లాడ్డం జరగదు. కానీ ఇక్కడ మా సీఎం మాట్లాడారు. శాసనసభ చరిత్రలో ఇలా ఇదివరకెన్నడూ జరగలేదు. సీఎం మాట్లాడారు కనుక ఇక నేను చెప్పేందుకేముంటుంది’’ అంటూ ఒక నిట్టూర్పు విడిచి బిల్లును ఆమోదించాలని కోరడంతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. రాష్ట్ర శాసనసభ జరుగుతున్న తీరుపట్ల ముఖ్యంగా ద్రవ్యవినిమయ బిల్లు సందర్భంగా సభలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పలువురు నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.



ఇలాంటి దారుణమైన సభావ్యవహారాలను తామిదివరకెన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. గంటలకొద్దీ సమయాన్ని వృధా చేయడానికి, ప్రతిపక్షనేతపై తీవ్ర విమర్శలు చేయడానికి  ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షానికి రెండు నిముషాలు కూడా ఇవ్వకుండా అడ్డుపడే ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సభలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రధానప్రతిపక్షం లేకుండానే ఆమోదింపచేసుకున్న తీరు మునుపెన్నడూ ఎరగని పరిణామమని విమర్శిస్తున్నారు.



తొండి ప్రకటనలో ‘సాక్షి’పై వ్యాఖ్యలు..

సభలో ప్రతిపక్షం లేని సమయంలో.. ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఏక పక్షంగా ఓ తొండి ప్రకటన చేసిన ముఖ్యమంత్రి అందులో ‘సాక్షి’ పైనా అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా మారింది.  ప్రశ్నపత్రాన్ని 10.25 గంటలకు ‘సాక్షి’ టీవీ విలేకరి ఒకరు వ్యాట్సప్‌లో నెల్లూరు డీఈవోకు పంపారని.. సాక్షి టీవీ విలేకరికే ఆ ప్రశ్నపత్రం ఎలా వచ్చిందని.. ఇందులో ఏదో కుట్ర ఉందంటూ ‘సాక్షి’ మీడియాపై బాబు తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు.



అదే పశ్నపత్రాన్ని నెల్లూరు సాక్షి టీవీ విలేకరి 10.25 గంటలకు డీఈవోకు వాట్సాప్‌లో పంపారని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు వెల్లడవుతా యని చెప్పారు. సాక్షి విలేకరి వాట్సాప్‌లో ఆ ప్రశ్నపత్రాన్ని డీఈవోకు పంపారని చెప్పిన చంద్రబాబు.. ఒకవేళ తప్పు చేసినవారైతే అలా ఎందుకు చేస్తారన్న చిన్న లాజిక్‌ మిస్‌ అయ్యారు. తప్పు జరుగుతోంది సరిదిద్దండి అంటూ జిల్లా విద్యాశాఖాధికారికి ఓ ఆధారాన్ని పంపిన విలేకరిపై అభాండాలు వేయం చూస్తేనే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎలా ఆలోచిస్తున్నారో.. దోషులను కాపాడడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top