బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సింగరేణి


గోదావరిఖని : సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన అంతర్గత 52.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం 55 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా, దానిని సాధించే అవకాశాలు లేకపోవడంతో సింగరేణి సంస్థ 52.50 మిలియన్ టన్నుల అంతర్గత ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని అధిగమించింది. మార్చి 31వ తేదీ నాటికి 52.53 మిలియన్ టన్నులను వెలికితీసి లక్ష్యాన్ని దాటింది.



సింగరేణి గనుల్లో భాగంగా వున్న 11 డివిజన్లలో కొత్తగూడెం 134 శాతం, మణుగూర్ 122 శాతం, రామగుండం-3 118 శాతం, శ్రీరాంపూర్ 104 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయి. రామగుండం-1 డివిజన్ 96 శాతం, రామగుండం-2 డివిజన్ 84 శాతం, భూపాలపల్లి 89 శాతం, బెల్లంపల్లి 69 శాతం, మందమర్రి 78 శాతం, ఇల్లెందు 94 శాతం, అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు 30 శాతం బొగ్గును వెలికితీశాయి.



2015-16లో 60.03 మిలియన్ టన్నుల లక్ష్యం



సింగరేణి సంస్థ ఏటా 10 శాతం బొగ్గు ఉత్పత్తిని పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 60.03 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏప్రిల్ నుంచే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించినట్లు సమాచారం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top