రాజకీయాలపై ఆసక్తి లేదు- సీఎం

రాజకీయాలపై ఆసక్తి లేదు- సీఎం - Sakshi


మైసూరు: దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తమకు రాజకీయాలపై ఆసక్తి సన్నగిల్లిందని వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడం తప్ప తమకు ఎటువంటి ఆశలు లేవంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శనివారం మైసూరు నగరానికి చేరుకున్న ఆయన మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తాము రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసామన్నారు. 1991వ సంవత్సరంలో జనతాదళ అభ్యర్థిగా కొప్పళ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమయంలో 2.10లక్షల ఓట్లు పొందినా కూడా పది వేల ఓట్ల తేడాతో ఓటమి చెందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.



 కాంగ్రెస్‌లో చేరిన అనంతరం అన్ని పదవులు అలంకరించామని అదేవిధంగా 2013లో విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టి ఐదు సంవత్సరాలు విజయంతంగా పూర్తి చేసుకోబోతున్న తమకు ఎటువంటి పదవులపై ఆశ లేదంటూ స్పష్టం చేసారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తమకున్న ఏకైక ఆశని ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. అదేవిధంగా జంకతల్‌ మైనింగ్‌ కేసుల విషయమై తాము కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి,జేడీఎస్‌ రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌.డీ.కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు చవకబారుతనంగా ఉన్నాయంటూ విమర్శించారు.



గతంలో తమతో పాటు మంత్రి హహదేవప్ప లాంటి నాయకులు ఉన్న సమయంలోనే జేడీఎస్‌ పార్టీ బలోపేతం కాలేకపోయిందని తాము చేసిందే చట్టమనే రీతిలో సాగుతున్న జేడీఎస్‌ పార్టీ ఇక ఎప్పటికీ బలోపేతం కాలేదంటూ తమదైన శైలిలో విమర్శించారు. ఇక బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తామే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో చులకన అవుతున్నారంటూ విమర్శించారు. సుప్రీంకోర్టులో, లోకాయుక్తల్లో 29 కేసులను నెత్తిపై పెట్టుకున్న యడ్యూరప్ప తమ ప్రభుత్వంపై అవినీతి ప్రభుత్వమంటూ విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరువు పర్యటనలో భాగంగా దళితులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు బీజేపీ ఆడిన నాటకం బట్టబయలైందన్నారు.



దళితులు ఇచ్చిన ఆహారాన్ని తిరస్కరించి హోటల్‌ నుంచి తెప్పించుకున్న ఆహారాన్ని తింటూ దళితులు ఇంట్లో తిండి తిన్నామని ప్రజలను మభ్య పెట్టడానికి బీజేపీ చేసిన కుటిల యత్నాలు రాష్ట్ర ప్రజలంతా పసిగట్టారన్నారు. గతంలో తాము చెప్పిన విధంగా జాతి సమీక్ష నివేదికలు అందిన అనంతరం దళితులకు 72 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా చివరిసారిగా వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించడం ద్వారా ఇక ముందు జరిగే ఎన్నికల్లో పోటీ చేయనంటూ గతంలో చేసిన ప్రకటనపై సీఎం సిద్ధరామయ్య యూటర్న్‌ తీసుకున్నారు..





కన్నడిగుల రక్షణకు చర్యలు...

బద్రినాథ్‌ దుర్ఘటనలో చిక్కుకున్న కన్నడిగులను రక్షించడానికి సత్వర చర్యలు తీసుకోవాలంటే ఢిల్లీలోని కర్ణాటక హైకమీషనర్‌కు సూచించామన్నారు. కన్నడిగుల రక్షించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ కమీషనర్‌కు సూచించామన్నారు. అవసరమయితే రాష్ట్రం నుంచి అధికారుల బృందాన్ని సహాయక చర్యలకు పంపించాలంటూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి తీసుకెళ్లామన్నారు. అదేవిధంగా రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అనురాగ్‌ తివారి మృతిపై విచారణకు తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసామన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top