చైనీస్‌ ఆర్మీని ఈడ్చిపారేసిన భారత బలగాలు

సరిహద్దులో భారత్‌, చైనా సైనికుల కొట్లాట


- సిక్కింలో బరితెగించిన డ్రాగన్‌.. వీడియో వైరల్‌

- ఇండియన్‌ చెక్‌పోస్టు ధ్వంసం.. అక్రమంగా చొరబడే యత్నం

- తిప్పికొట్టిన భారత బలగాలు.. ఘటనపై సర్వత్రా ఆగ్రహం




గ్యాంగ్‌టక్‌:
సరిహద్దులో డ్రాగన్‌ దేశం చైనా కవ్వింపు చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సిక్కింలోని భూటాన్‌ సరిహద్దు వద్ద జరిగినట్లు భావిస్తోన్న ఘటనలో చైనీస్‌ సైన్యం.. భారత బలగాలను రెచ్చగొట్టడం, ప్రతిగా మనవాళ్లు డ్రాగన్లను అవతలికి నెట్టేయడం లాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన భారత యాత్రీకుల బృందాన్ని భూటాన్‌ సరిహద్దుల్లో అడ్డుకున్న చైనా తీరును భారత్‌ నిరసించిన సంగతి తెలిసిందే. ఆ వివాదం సర్దుమణగకముందే డ్రాగన్స్‌ దూకుడుకు సంబంధించిన వీడియో బయటికి రావడం సంచలనంగా మారింది.



భారత బలగాలను రెచ్చగొడుతూ, ఉద్దేశపూర్వకంగా సరిహద్దు దాటి ఇవతలికి వచ్చిన  చైనీస్‌ సైనికుల తీరుపై సర్వత్రా ఆగ్రహ్యం వ్యక్తమవుతోంది. సిక్కిం-భూటాన్‌ సరిహద్దులోని ‘డోకా లా’ ప్రాంతంలో ఈ కొట్లాట జరినట్లు సమాచారం. అయితే ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టతే రాలేదు. కాగా, పదిరోజుల కిందట ఇదే డోకాలా ప్రాంతంలో భారత్‌ పునర్‌నిర్మించిన ఓ చెక్‌పోస్టును చైనీస్‌ ఆర్మీ ధ్వసం చేసినట్లు తెలిసింది. ఈ చర్యను భారత్‌ తీవ్రంగా నిరసించినందునే ప్రతీకారంగా చైనా.. భారత యాత్రీకులను అడ్డుకుందనే విమర్శలున్నాయి.



కైలాస మానస సరోవర యాత్రీకులను చైనీస్‌ సైనికులు అడ్డుకున్న ఘటనలో మొదట ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. అటుపై వాతావరణ సమస్యలున్నందువల్లే యాత్రను ఆపేసినట్లు చైనా ప్రకటించింది. ఇక సైనికుల కొట్లాటకు సంబంధించి వైరల్‌గా మారిన వీడియోపై ఇరుదేశాల అధికారారులు స్పందించాల్సిఉంది. సిక్కిం సరిహద్దులోని భూటాన్‌ నిజానికి స్వతంత్ర దేశం. కానీ దాని స్వతంత్రతను గుర్తించని చైనా.. ఇప్పటికే కీలక భూభాగాలను స్వాధీనం చేసుకుని ఆధిపత్యం చలాయిస్తోంది.


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top