ఆ విమానం కూలిపోయిందని ఎలా చెబుతారు?

ఆ విమానం కూలిపోయిందని ఎలా చెబుతారు? - Sakshi


కౌలాలంపూర్:  గమ్యస్థానం చేరగానే ఫోన్ చేస్తామని... విమానం ఎక్కారు. బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఆ విమానం అదృశ్యమైంది. ఆ వార్త వినగానే ప్రయాణికుల బంధువుల మనస్సుల్లో అలజడి మొదలైంది.  అసలు విమానం ఏమైందో నేడు కాకుంటే రేపు అయినా తెలుస్తుందని చిగురంత ఆశతో ఉన్నారు. ఒకటి, రెండు కాదు... ఏకంగా 11 నెలలు అయింది. ఇంతవరకు విమానం కాని బంధువుల జాడ కాని తెలియలేదు.


వారంతా ఏమయ్యారో అని సతమతమవుతున్న తరుణంలో విమానం కూలిపోయింది... అందులోని 239 మంది మరణించారని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రకటించడంతో సదరు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.... ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలా కాదు మలేసియా ప్రభుత్వంతో తాడో పేడో తెల్చుకోవాలని భావించారు. అందులోభాగంగా విమాన ప్రమాదంలో ఆచూకీ తెలియకుండా పోయిన చైనాకు చెందిన 21 కుటుంబాలు ఆగమేఘాల మీద శుక్రవారం కౌలాలంపూర్ చేరుకున్నారు.  విమానం కూలిపోయిందంటూ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు మలేసియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



విమాన శకలాలు, మృతదేహాలు ఆచూకీ తెలియకుండా ప్రమాదం జరిగిందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. విమాన ప్రమాద వార్తతో తమ కుటుంబాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనుభస్తున్న ఆవేదన మీకు అర్థం కావడం లేదంటూ మలేసియా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విమాన ఆచూకీ కోసం గట్టి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. విమానం అదృశ్యమైన ప్రాంతంలో గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని మలేసియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది.  బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ విమానంలో  మలేసియా వాసులు,  154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top