సింగపూర్ ప్లాన్‌లో చైనా మార్పులు

సింగపూర్ ప్లాన్‌లో చైనా మార్పులు - Sakshi


సాక్షి, విజయవాడ బ్యూరో: సింగపూర్ రూపొందించి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో చైనాకు చెందిన జీఐఐసీ (గిజొ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్) సంస్థ మార్పులు చేస్తోంది. కొద్దిరోజులుగా సీఆర్‌డీఏతో కలిసి ఆ సంస్థ ప్లాన్‌కు మెరుగులు దిద్దుతోంది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వ సంస్థలైన సుర్బానా, జురాంగ్ కంపెనీలు తయారు చేసి ఇచ్చిన విషయం తెలిసిందే. దానిని రాష్ట్రప్రభుత్వం రెండు నెలల క్రితం ఆమోదించింది.



అయితే స్థానిక పరిస్థితులు, ఇతర విదేశీ నగరాల ప్రణాళికలు పరిగణనలోకి తీసుకుని, దేశవిదేశీ నిపుణులు ప్లాన్‌లో లోపాలు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన తర్వాత ప్లాన్‌లో పలు మార్పులు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. దీంతో చాలారోజుల నుంచి సీఆర్‌డీఏ ఆ పనిలో నిమగ్నమైంది. అందుకే ఇంతవరకూ మాస్టర్‌ప్లాన్‌కు తుదిరూపం ఇవ్వలేదు. ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనలో అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరిన మీదట చైనాకు చెందిన జీఐఐసీ కంపెనీ ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం విజయవాడ వచ్చి సీఆర్‌డీఏతో చర్చలు జరిపి వెళ్లారు. ఆ తర్వాత కంపెనీకి చెందిన 15 మంది నిపుణుల బందం రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో పాలుపంచుకునేందుకు విజయవాడ వచ్చింది.



ప్రస్తుతం సీఆర్‌డీఏ కార్యాలయంలోనే వారు తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటుచేసుకుని పనిచేస్తున్నారు. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, జలవనరులు, విద్యుత్, డ్రెయినేజీ, రోడ్ల వ్యవస్థలు, నివాస సముదాయాలు, టూరిజం తదితర అన్ని అంశాల్లోనూ వారు సింగపూర్ ప్లాన్‌లో మార్పులు ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఈ పనిని జీఐఐసీ ఉచితంగా చేయడానికి ముందుకు వచ్చినట్లు సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాజధానిలో చేపట్టే ప్రాజెక్టుల్లో కొన్నింటిని ఈ కంపెనీకి ఇవ్వాలనే ముందస్తు ఒప్పందంతోనే ప్లాన్‌లో మార్పులు చేయడానికి వారు పనిచేస్తున్నట్లు సమాచారం.

 

మౌలిక వసతుల ప్లాన్ కూడా విదేశీ సంస్థకే..

రాజధాని తుది మాస్టర్‌ప్లాన్ సిద్ధమైన తర్వాత మౌలిక వసతుల మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయడానికి సీఆర్‌డీఏ సమాయత్తమవుతోంది. రాజధాని నగరంలోని 29 గ్రామాలతో పాటు రీజియన్ మొత్తంలో మౌలిక వసతులకు సంబంధించిన ప్లాన్‌ను తయారు చేయాల్సివుంది. 29 గ్రామాలు, కొత్తగా నిర్మించే రాజధాని నగరంలో ఇళ్లు, నివాస సముదాయాలు, రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, పౌరసేవలు వంటి అనేక అంశాలతో ఈ ప్లాన్‌ను తయారు చేయనున్నారు.



దీన్ని రూపొందించే బాధ్యతను విదేశీ కంపెనీకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్థాయి ప్రణాళికను రూపొందించే సామర్థ్యం మనకు లేదు కాబట్టి కచ్చితంగా విదేశీ కంపెనీతో ఈ ప్లాన్‌ను తయారుచేయాలని సీఆర్‌డీఏ చెబుతోంది. ఈ ప్లాన్‌ను జీఐఐసీకి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అందుకే ఆ చైనా కంపెనీ ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌కు మెరుగులు దిద్దుతున్నట్లు తెలిసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top