చెన్నై చూపు...ఆకాశం వైపు

చెన్నై చూపు...ఆకాశం వైపు


- హెలికాప్టర్ కనిపిస్తే చాలు.. ఆహారం కోసం బాధితుల హాహాకారాలు


- శాంతించిన అడయార్, కూవం నదులు


- ఇంకా భారీ ముంపులోనే లోతట్టు ప్రాంతాలు


- పొంచి ఉన్న అంటువ్యాధుల ముప్పు


- ఇళ్లలోనే బందీలైన ప్రజలు.. పాలు, తాగునీరు లేక అవస్థలు


- ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు


- వాటర్ క్యాన్ రూ.200, పాలు లీటర్ రూ.100


- సహాయక చర్యలు కొనసాగిస్తున్న సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్


- మళ్లీ భారీ వర్షం.. బిక్కుబిక్కుమంటున్న జనం


‘నా పేరు ప్రసన్న వెంకటరామ్. ఒక అమెరికన్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ చెన్నై బ్రాంచిలో సిస్టమ్ ఎనలిస్టుగా పనిచేస్తున్నా. ప్రస్తుతం నేను 18 లక్షల వార్షిక ఆదాయాన్ని పొందుతున్నా. చెన్నై నగరంలో ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ నాకుందని చెప్పుకోవడానికి గర్విస్తాను. ఆర్థికంగా నా శక్తి సామర్థ్యాల గురించి ఇంకా చెప్పాలంటే... ఈ క్షణంలో లక్ష రూపాయల పరిమితితో రెండు క్రెడిట్ కార్డ్స్, రూ.65 వేల బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గరుంది... ఇదే క్షణంలో నేను మా ఇంటి టై పై నిలబడి ఏదైనా అన్నం పాకెట్ వచ్చిపడుతుందా అని ఆర్తిగా ఎదురుచూస్తున్నా! ఆర్థికంగా స్థితిమంతుడైన నేను ఇప్పుడు బతకాలంటే కావాల్సింది తినడానికి ఇంత ఆహారం, తాగడానికి కాసిన్ని నీళ్లు. మా ఇంటిని వరదనీరు చుట్టుముట్టింది.



బయటకు అడుగుపెట్టే పరిస్థితే లేదు. దీంతో ఒక యాచకుడిలా మారింది నా స్థితి. నిన్నటి వరకూ నా ఆలోచనలు, ప్రాధాన్యతలు వేరు. నా అప్రైజల్ గురించి, ఈ  ఏడాదికి నేను కోరుకుంటున్న 15 శాతం హైక్ దొరుకుతుందా లేదా.. అని మధనపడేవాడిని. అయితే ఊహించనే లేని రీతిలో ఈ రోజు.. మా ఇంటి టై మీదకు ఎక్కి హెలికాప్టర్ల నుంచి ఏమైనా అన్నం పాకెట్లు పడతాయా.. అని ఎదురుచూస్తున్నా... ప్రకృతి మనిషి ప్రాధాన్యతలను, స్థితిని మార్చేయగలదనే పాఠం ఇప్పుడు బోధపడుతోంది.’  - చెన్నైకి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వాట్సాప్‌లో షేర్ చేసిన మెసేజ్ ఇది.  రాజు-పేద తేడా లేకుండా చెన్నై వాసులను కబళించిన వరద తీవ్రతకు నిదర్శనమీ మెసేజ్.


 

 సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైతో వరుణుడు చెలగాటమాడుతున్నాడు. అక్కడక్కడా అడపాదడపా చిరుజల్లులు మినహాయించి దాదాపుగా రోజంతా వర్షపు జాడ లేకపోవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ శుక్రవారం మధ్యాహ్నానికి వారి ఆనందం కాస్తా ఆవిరైపోయింది. కారు మబ్బులు మళ్లీ ముంచుకొచ్చాయి. మైలాపూర్, కొట్టూర్‌పురం, కోడంబాక్కం, టీ నగర్, అడయార్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అడయార్ నది పక్కన ఉన్న కొట్టూర్‌పురంలో ఇప్పటికీ రెండో అంతస్తు వరకు నీళ్లున్నాయి. వేలచెరి తదితర ప్రాంతాలు కూడా ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. మధ్యమధ్యలో కురుస్తున్న వర్షాలు సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అయితే రాత్రికి భారీ వర్షం తిరిగి ప్రారంభమయ్యింది.



తమిళనాడు దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో.. మళ్లీ భీకర ముంపును తలుచుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు వరద కొంత తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ ఇళ్ల మిద్దెలపై, బహుళ అంతస్తుల భవనాలపై చిక్కుకుపోయినవారు ఆహారం కోసం అలమటిస్తున్నారు. హెలికాప్టర్ ఏదైనా కనబడితే చాలు ఆహార పొట్లాల కోసం తలలు పెకైత్తి ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి చూపూ ఆకాశం వైపే. శాంతించు వాన దేవుడా అంటూ కొందరు.. హెలికాఫ్టర్లు జారవిడిచే ఆహారం కోసం ఇంకొందరు. కాగా సుమారు 12 లక్షల ఇళ్లు ముంపునకు గురయ్యాయని, 50 లక్షల మంది నిరాశ్రయులైనట్లు ప్రాథమిక అంచనా. 1.27 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రభుత్వం తెలిపింది.



 చేతిలోనూ, ఏటీఎంలలోనూ డబ్బుల్లేవు..

 చెన్నైవాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొందరికి డబ్బుల్లేవు. బ్యాంకులో డబ్బున్నా తీసుకుందామంటే ఏటీఎంలు పనిచేయడం లేదు. చేతిలో డబ్బులున్నవారికి కొనేందుకు నిత్యావసరాలు అందుబాటులో లేవు. నగరంతో పాటు శివార్లలో లక్షలాదిమందిని పాలు, నీళ్లు, ఆహార వస్తువుల వంటి నిత్యావసరాల కొరత వేధిస్తోంది. కొన్నిచోట్ల అందుబాటులో ఉన్నా రేట్లు చుక్కలనంటుతున్నాయి. లీటర్ ఆవిన్ పాల ప్యాకెట్ రూ.100 వరకు ధర పలికింది. కొన్నిచోట్ల అరలీటర్ ప్యాకెట్టుకు కూడా వంద వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. చెన్నై నగరానికి రోజుకు 11.5లక్షల లీటర్ల ఆవిన్ పాలు, ప్రైవేటు సంస్థల నుండి మరో 25 లక్షల లీటర్ల పాలు సరఫరా కావాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా పాలసేకరణ దెబ్బతినడంతో రోజుకు 7 లక్షల లీటర్ల పాలే సరఫరా జరుగుతోంది. దీంతో ప్రైవేటు పాల వ్యాపారులు అందిన కాడికి దోచుకుంటున్నారు.



కోయంబేడు మార్కెట్‌కు తాజాగా కూరగాయలు రాకపోవడంతో కిలో టమాటా రూ.80 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. ఇక వాటర్ క్యాన్ ధరైతే దాదాపుగా డబుల్ సెంచరీకి (రూ.200) చేరువైంది. కొన్నిచోట్ల అది కూడా అందుబాటులో లేదు. కొందరు అరటిపండ్లతో ఆకలి తీర్చుకుంటున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. ఒక్కో అరటిపండును రూ.20 చొప్పున కూడా వ్యాపారులు విక్రయిస్తున్నారు. ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్.కె.నగర్‌ను సందర్శించిన సీనియర్ మంత్రులు నాథం విశ్వనాథన్, సెల్లూర్ రాజు, గోకుల్ ఇందిరలను స్థానికులు ఘెరావ్ చేశారు.



ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజలు తమకెలాంటి సహాయం అందకపోవడంపై అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. హోటళ్లు మూతపడటం నగరవాసుల కష్టాలను రెట్టింపు చేసింది.  రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నిరాశ్రయులైన వేలాది మంది స్వస్థలాలకు చేరుకోవడం కష్టసాధ్యంగా మారింది. ముఖ్యంగా విద్యాసంస్థలను సైతం వరద ముంచెత్తడంతో సొంతూళ్లకు బయలుదేరిన విద్యార్థులకు తమ ఇళ్లకు ఎలా చేరుకోవాలో అర్థం కావడం లే దు. రైళ్లు లేవు. అరకొరగా అందుబాటులో ఉన్న బస్సుల్లో వెళ్లేందుకు ఒక్కొక్కరూ రూ.1000 నుంచి రూ.2,000 వెచ్చించాల్సి వచ్చింది. కొందరికి ఆ అవకాశం కూడా చిక్కకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతం.



 సేవల పాక్షిక పునరుద్ధరణ

 విమాన, రైళ్ల సర్వీసులు శుక్రవారం పాక్షికంగా ప్రారంభమయ్యాయి. మొబైల్ ఫోన్ సర్వీసులను కూడా పాక్షికంగా పునరుద్ధరించారు. 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. మౌంట్ రోడ్‌తో పాటు మరికొన్ని కీలక రోడ్లలో శుక్రవారం అధికారులు మూడురోజుల తర్వాత ట్రాఫిక్‌ను అనుమతించారు. పెట్రోలు బంకుల్లోకి నీరు చేరిపోవడం వల్ల డీజిల్, పెట్రోలు లభించడం లేదు. డీజిల్ దొరక్కపోవడంతో జనరేటర్లు మూగబోయాయి. ట్యాంకర్ల డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో డీజిల్, పెట్రోల్ తరలింపు సమస్యాత్మకంగా మారింది.



 10 వేలమందిని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్

 ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ తీవ్ర ముంపు ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాయి. ఎన్డీఆర్‌ఎఫ్ శుక్రవారం సహాయక కార్యక్రమాలు మరింత ముమ్మరం చేసింది. ఇంతవరకు 10 వేలకు పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సంస్థ డీజీ ఓపీ సింగ్ తెలిపారు. మనాలి, కొట్టూర్‌పురం, గ్లోబల్ హెల్త్ సిటీ ప్రాంతాల్లో బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేసినట్లు తెలిపారు.



 ఐటీపీఎల్ కాలనీలో ముగ్గురి మృతి

 నందంబాక్కంలోకి చెంబరబాక్కం చెరువు నీరు భారీఎత్తున చేరిపోవడంతో ఐటీపీఎల్ కాలనీ మునిగిపోయింది. కాలనీలోని ఓ కుటుంబ యజమాని కృష్ణన్ ఎప్పుడో మరణించాడు. ఆయన భార్య సుశీల (62), నడవలేని వికలాంగురాలైన కుమార్తె విజయ (36), కుమారుడు వెంకటేశన్ (32)లను వరదనీరు నిలువునా ముంచేయడంతో బైటకురాలేని స్థితిలో ప్రాణాలు కోల్పోయారు.

 

 అప్పుడు ప్రీతి.. ఇప్పుడు భీతి

 వాన.. ఒకప్పుడు ఈ పదమంటే తమిళనాడు ప్రజలకు ఎంతో ప్రీతి. నేడు అదే రెండు అక్షరాల పదం తమిళనాడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాల ప్రజలు వానపేరు చెబితేనే వణికి పోతున్నారు. సహజంగా తమిళనాడులో ఎప్పుడూ లోటు వర్షపాతమే. చెన్నై నగరంతోపాటూ అనేక ప్రధాన నగరాలు తాగునీటి కోసం తపిస్తుంటాయి. చెన్నై వాసులైతే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే కృష్ణ నీటికోసం ఏటా ఎదురుచూస్తుంటారు. చెన్నై నగరంలో తాగునీటి కటకటను తట్టుకోలేక కృష్ణా జలాల కోసం ఏపీ ప్రభుత్వంపై కేసు దాఖలు చేసేందుకు సైతం ఇటీవల సిద్ధమైంది.



నైరుతి రుతుపవనాలు తమిళనాడుపై ముఖం చాటేసినా అక్టోబరు 28వ తేదీన ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. చిరుజల్లులతో ప్రారంభమై అడపాదడపా వర్షాలతో పులకరింపజేశాయి. అయితే గతనెల మొదటి వారంలో రుతుపవనాల ప్రభావం తీవ్రమై తుఫాను రూపంలో కడలూరు జిల్లాను కుదిపేశాయి. ఆ తరువాత మందగించిన వర్షాలు క్రమేణా విశ్వరూపం దాల్చాయి. ప్రకృతి చేసిన విలయతాండవం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం...ఈ మూడు జిల్లాల ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. చెరువులు, ఊర్లు ఏకమైనాయి. దీంతో జనం తంజావూరులో వరుణదేవుని ఆలయంలో  ఇక వర్షాలు వద్దు అంటూ శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

 

భారీవర్ష సూచన


 అల్పపీడనం కొనసాగుతుండటంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లోని చాలా ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ ఎస్.ఆర్.రమణన్ చెప్పినట్టు పీటీఐ వెల్లడించింది. దక్షిణ కోస్తా తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం అతి భారీ వర్షాలకు కూడా కురిసే సూచనలున్నాయని పుణెలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. చెన్నైలో అడపాదడపా వర్షం కొనసాగుతుండగా పుదుచ్చేరి,  కడలూరు, కారైక్కాల్, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top