తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడండి

తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడండి


- తమిళనాడులో తెలుగు మాధ్యమం ఉండాలి

- జయలలితకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

 

సాక్షి, విజయవాడ బ్యూరో: తమిళనాడులో తెలుగుభాషాభివృద్ధికి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం లేఖ రాశారు. తమిళనాడు ప్రభుత్వం విద్యావిధానం-సామాజిక కలుపుగోలు లక్ష్యాలను అమలు చేస్తున్నందున తెలుగు మీడియం పాఠశాలలను కొనసాగించాలని ఆయన కోరారు. తమిళనాడులో తెలుగువారి కోసం పాఠశాల స్థాయిలో తెలుగును రెండో బోధన భాషగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖకు ఆదేశాలిచ్చి భాషాపరమైన సహకారం అందించడం వల్ల చారిత్రకంగా, సాంస్కృతికపరంగా, జాతులపరంగా తమిళనాడులో ఉన్న ప్రవాసాంధ్రుల వికాసానికి మీ ప్రభుత్వం దోహపడినట్టు అవుతుందని తమిళనాడు సీఎంను కోరారు. ఏపీలో 60 పాఠశాలు తమిళ మీడియం ఉన్నాయని సీఎం వివరించారు.

 

 18 నెలల్లో పూర్తి చేయాలి

 కాకినాడ ప్లోటింగ్ ఎల్‌ఎన్‌జీ స్టోరేజ్ రీ గ్యాస్‌ఫికేషన్ యూనిట్ (ఎఫ్‌ఎస్‌ఆర్‌యూ)ను 18 నెలల్లో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో షెల్ ఇండియా కంట్రీ చీఫ్ యూస్మిన్ హిల్టన్‌తో మాట్లాడారు. టెర్మినల్ నిర్మాణానికి నిధులు సమీకరణ, సకాలంలో పనులు పూర్తి చేయడం వంటి విషయాలను చర్చించారు.

 

 పెట్టుబడులకు ముందుకొచ్చిన ఐఎఫ్‌సీ

 ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (ఏపీజీడీసీ)లో 30 శాతం పెట్టుబడులు పెట్టేం దుకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) ముందుకొచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో ఐఎఫ్‌సీ రీజినల్ హెడ్ జెస్సికా జోలెన్ పార్మర్ భేటీ అయ్యారు. 40 ఏళ్లుగా అంతర్జాతీయ రంగంలో పనిచేస్తున్నామని 15 ప్లాంట్లు నెలకొల్పామని జెస్సికా సీఎంకు వివరించారు.

 

 జ్వరాల తీవ్రతపై సీఎం టెలీకాన్ఫరెన్స్

 రాష్ట్రంలో ఆస్పత్రుల నిర్వహణ, అపరిశుభ్రత, అంటువ్యాధుల తీవ్రతపై సీఎం చంద్రబాబు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లాస్థాయి వైద్యాధికారులు, కలెక్టర్లు, ఇతరమున్సిపల్ కమిషనర్‌లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ, విజయవాడల్లో స్ల్వైన్‌ప్లూ నిర్థారణ కేంద్రాలను నెల రోజుల్లో ఏర్పాటుచేయాలని ఆయన ఆదేశించారు.

 

 జనవరి 1 నుంచి అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే

 గ్రామపంచాయతీలు నిర్వహించే 11 రకాల పౌరసేవలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. జనన, మరణాల నమోదు, ఇంటి పన్నుల చెల్లింపులు, వ్యాపార అనుమతులు, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి అన్ని సేవలను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు.

 

 ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు: సీఎం

 పటమట(విజయవాడ): ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆర్టీసి ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినందుకు బుధవారమిక్కడ నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) ఆధ్వర్యంలో సీఎంను సన్మానించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top