రాజధానిపై రాజ'కీ'యం

రాజధానిపై రాజ'కీ'యం - Sakshi


విజయవాడ : ఏపీ రాజధాని నిర్మాణం విషయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కోణాన్ని వదల్లేదు. సీఎం ఛైర్మన్గా వ్యవహించే సీఆర్డీఏ తొలి సమావేశం శుక్రవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు రాజధాని నిర్మాణం ఎవరూ అడ్డు తగలకుండా ఉండాలనే కోణాన్ని ఆవిష్కరించాయి. భూ సమీకరణ, భూ సేకరణ అంటూ రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం కారణమవుతున్నప్పటికీ రాజకీయ పక్షాలు పట్టీపట్టనట్లే ఉండాలనే రీతిలో సీఎం స్పందించారు.



ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు దఫాలుగా రాజధానిలో భూ సేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.  భూ సేకరణ ఆగిన క్రెడిట్ వైఎస్ఆర్ సీపీకి వెళ్లకూడదన్న ఎత్తుగడతో టీడీపీ నేతలు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘనతగా చెప్పుకున్నారు.



రాజధాని నిర్మాణం విషయంలో రెచ్చగొట్టే విధానాలు, ఆందోళనలు నెలకొంటే పెట్టుబడులు రావనే నేపథ్యంలో ప్రధానంగా రాజధాని ప్రాంతంలోని యువతను ఆకట్టుకునే అంశంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. రాజధాని ప్రాంతంలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని ప్రటకించారు. ఎంపిక చేసిన యువకులకు శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ కాలంలో నెలకు రూ.వెయ్యి చొప్పున స్టైఫండ్, ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పుకొచ్చారు. పేదలకు ఉపాధి కోసం 29 గ్రామల్లోనూ జాతీయ ఉపాధి పథకంలో పనులు కల్పించాలని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top