ఆ రెండు దేశాలను మనోళ్లు నాశనం చేస్తారు

ఆ రెండు దేశాలను మనోళ్లు నాశనం చేస్తారు - Sakshi


సింగపూర్, అమెరికాలనూ నాశనం చేస్తారంటూ వ్యాఖ్యలు


  • ఎన్‌ఆర్‌ఐలపై చంద్రబాబు ధ్వజం

  • స్వదేశానికి రాగానే సామాజిక కోణం విస్మరిస్తున్నారు

  • స్వేచ్ఛను అనుభవిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు

  • నారావారిపల్లెలో సీఎం సంక్రాంతి సంబరాలు


తిరుపతి రూరల్‌/ చంద్రగిరి: ‘‘పనిమీద అంకితభావం ఉండదు.. నిర్లక్ష్యం ఎక్కువ.. సామాజిక కోణాలు పట్టించుకోరు.. అక్కడ వ్యవస్థలు పటిష్టంగా ఉండబట్టి సరిపోయింది. లేకుంటే మనోళ్లు సింగపూర్, అమెరికాలను సైతం నాశనం చేస్తారు..’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవాస భారతీయులపై ధ్వజమెత్తారు. విదేశాల్లో వ్యవస్థల వల్ల నిబద్దతతో ఉండే ఎన్‌ఆర్‌ఐలు, స్వదేశంలోకి రాగానే సామాజిక కోణం విçస్మరించి విపరీతమైన స్వేచ్ఛను అనుభవిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారని విమర్శించారు. అమ్మను, జన్మభూమిని విస్మరించకుండా సేవలు అందించాలని కోరారు. సంక్రాంతి పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.



మన దేశంలో వ్యవస్థలు సరిగా లేవని, బాగుపడేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని అన్నారు. ఈ ఏడాది అమ్మను, ఆంధ్రాను మరవద్దని విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ పశువులకు హాస్టళ్లు కట్టిస్తామని, ప్రయోగాత్మకంగా తొలుత నారావారిపల్లెలోనే దీనిని ప్రారంభిస్తామని తెలిపారు. ‘గతంలో ఎక్కువ పనిచేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయని అధికారులను పరుగులు పెట్టించా.. కానీ అది తప్పు అని తెలుసుకున్నా. చేసే పని ఎంతైనా తృప్తిగా చేస్తేనే ఫలితాలు వస్తాయి అని గుర్తించా. అందుకే నచ్చిన పనిని ఆనందంగా చేయాలని ఇప్పుడు పిలుపునిస్తున్నా’ అని చంద్రబాబు చెప్పారు.



దావోస్‌కు చంద్రబాబు పయనం   

సాక్షి,, అమరావతి:  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం రాత్రి దావోస్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన సోమవారం స్విస్‌ ఇండియా చాంబర్స్‌ ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు.



కన్సల్టెంట్లను నియమించండి

రాజధాని నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకునేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమించుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని వ్యవహారాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఆర్‌డీఏ, ఏడీసీ విభాగాలకు అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమించు కోవాలన్నారు.



సంక్రాంతి సంబరాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలో కుటుంబసభ్యులతో కలసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. శనివారం ఉదయం సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, తమ్ముడి కుమారుడు నారా రోహిత్‌ తదితరులతో కలసి నాగాల మ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top