హోదా అంటే జైలుకే

హోదా అంటే జైలుకే - Sakshi


- విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం వార్నింగ్

- ప్రతిపక్షనేత విద్యార్థులతో తనపై బురద జల్లిస్తున్నారని ఆరోపణ

 

 బాపట్ల: ప్రత్యేకహోదా సమావేశాలకు విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిదండ్రులను హెచ్చరించారు. రాష్ట్రంకోసం తాను నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విద్యార్థులతో తనపై బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఏర్పాటుచేసే సమావేశాలకు వెళితే వారు కూడా జైలుకు వెళ్తారని చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల ఏలూరులో జరిగిన మీటింగ్‌లో ప్రతిపక్ష నేత నాపై బురదజల్లించే ప్రయత్నం చేస్తున్నారు.



ఇక్కడున్నవారికి పిల్లలుండే ఉంటారు. మీ పిల్లలు చదువు కోసం వెళితే కళాశాలలో బుద్ధిగా చదువుకొని రమ్మని చెప్పండి. మీటింగ్‌లు, చాటింగ్‌లు అంటూ వెళితే ఆయన వారికి కూడా జైలుకు వెళ్లడం నేర్పిస్తారు. ప్రత్యేకహోదా అంటూ సమావేశాలకు వెళితే వారు కూడా జైలుకు వెళ్తారు..’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక హోదా అని చెబుతున్నారే కానీ హోదా వల్ల ఒరిగేదేంటి? అని అడిగితే ఏ ఒక్కరూ సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ‘‘ఎంతో చదువుకున్నామన్నారు.. ఇతర దేశాల్లో స్థిరపడ్డారు.. ప్రత్యేక హోదాపై వారికి కనీస అవగాహన కూడా లేదు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని చెబుతున్నారు.. అసలు పరిశ్రమల రాయితీలకు, ప్రత్యేక హోదాకు ఏమైనా సంబంధం ఉందా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మాట్లాడుకోనివ్వండి’’ అంటూ ప్రవాసాంధ్రులపై సీఎం చిర్రుబుర్రులాడారు. తనపై ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చంద్రబాబు చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top