ఎన్కౌంటర్లో నయీమ్ గురువు హతం

ఎన్కౌంటర్లో నయీమ్ గురువు హతం - Sakshi


-ముగిసిన కిష్టయ్య ప్రస్థానం...

-ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతం

-ఆర్‌ఎస్‌యూ నుంచి కేంద్ర కమిటీ దాకా..

-రెండు దశాబ్దాలకు పైగా ఉద్యమ జీవనం

-సాంబశివుడికి, నయీమ్‌కు ఇతడే గురువు..!




యాదాద్రి: మిలిటెంట్‌గా ఉద్యమాన్ని ప్రారంభించి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన చామల కిష్టయ్య అలియాస్ దయా 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. జిల్లాలో ఎందరినో ఉద్యమబాట పట్టించిన కిష్టయ్య అంచలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక మధిర గ్రామమైన దాసిరెడ్డిగూడేనికి చెందిన చామల చంద్రమ్మ, రామయ్యల ఆరవ సంతానం కిష్టయ్య. విద్యార్థి దశలోనే పీపుల్స్‌వార్ ఉద్యమంలోకి వెళ్లాడు.



భువనగిరి ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కళాశాలలో బీకాం చదువుతూ 1990లో ఆర్‌ఎస్‌యూ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆలేరు, కృష్ణపట్టె దళాల్లో మిలిటెంట్‌గా పని చేస్తూ ఈ ప్రాంతం నుంచి ఎందరినో ఉద్యమంలోకి తీసుకెళ్లాడు. వలిగొండ, భువనగిరి, ఆలేరుతో పాటు జిల్లాలోని పలువురిని ఉద్యమ బాట పట్టించాడు. హైదరాబాద్‌లో పీపుల్స్‌వార్ ప్రచార దళాల్లో పని చేస్తూ ఉద్యమంలోకి పూర్తి స్థాయిగా వెళ్లాడు. పోలీసులు పలుమార్లు వచ్చి మీకుమారుడిని ఉద్యమంలోంచి బయటకు రమ్మని కోరమంటూ తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తులు కిష్టయ్య లెక్క చేయలేదు. తనకంటే పెద్దవారైన ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు, తల్లిదండ్రులు ఉన్నా ఏనాడు ఇంటి వైపే చూడలేదు.



అతనో నాయకుడు

పీపుల్స్‌వార్ ఉద్యమంలో రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన సాంబశివుడు, గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్‌తో పాటు మరెందరినో పార్టీలో చేర్పించాడు. ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కళాశాలలో చదువుతుండగా అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న భువనగిరికి చెందిన నయీమ్‌ను పీపుల్స్‌వార్‌లో చేర్పించాడు. అలాగే అతడి స్వగ్రామమైన దాసిరెడ్డిగూడెంలో సాంబశివుడు, అతడి సోదరుడు కొనపురి రాములు, రాపోలు స్వామిని ఉద్యమ బాట పట్టించాడు. ఒక విధంగా వలిగొండలో పీపుల్స్‌వార్‌కు ఎందరో ముఖ్య కార్యకర్తలను, నాయకులను, సానుభూతిపరులను తయారు చేసిన నాయకుడని కిష్టయ్య గురించి తెలిసినవారు చెబుతారు.



26 ఏళ్లుగా ఇంటి ముఖం చూడకుండా..

పీపుల్స్‌వార్‌లోకి వెళ్లిన కిష్టయ్య తన 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఒక్క రోజు కూడా ఇంటిముఖం చూడలేదు. నిరుపేదలైన అతడి తలిదండ్రులు అవస్థలు పడుతున్నా వారిని పట్టించుకోలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు తమ కొడుకు ఎలా ఉంటాడోనని తల్లి చంద్రమ్మ అప్పుడప్పుడు ఆవేదన చెందుతుండేది. గ్రామస్తులు సైతం కిష్టయ్య పేరు తప్పా ఆయన ఉనికి తెలియని పరిస్థితి.



2008లో బుల్లెట్ గాయాలతో తప్పించుకుని..

మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరిన చామల కిష్టయ్యకు గన్‌మెన్‌గా దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు స్వామి ఉండేవాడు. ఉత్తరాంధ్ర(ఇప్పుడు ఏఓబీ)లో పనిచేస్తుండగా 2008లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో స్వామి మృతిచెందాడు. అప్పుడు కిష్టయ్య బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు. ఉద్యమం కోసం జీవితాంతం తపించిన కిష్టయ్య ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో అతడి సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానానికి తెరపడింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top