ఎలక్ట్రిక్ టూ-వీలర్ల ధరలు తగ్గుతాయట!

ఎలక్ట్రిక్ టూ-వీలర్ల ధరలు తగ్గుతాయట! - Sakshi


న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ టూ-వీలర్ల ధరల తగ్గింపుకు కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. పెట్రోల్, డీజిల్ బైక్ లకు సమానంగా లేదా వాటికంటే తక్కువగా ఈ ధరలు తెచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. భారత్ లోని మేజర్ సిటీల్లో కర్బన ఉద్గారాల స్థాయి తగ్గించే నేపథ్యంలో కేంద్రం ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై దృష్టిసారించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరితమైన నగరాల జాబితాలో భారత సిటీలు ఉండటంతో, ఈ కాలుష్యాన్ని ఎలాగైనా తగ్గించాలని  కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల ధరల తగ్గింపుకు భారీ పరిశ్రమల డిపార్ట్ మెంట్ నుంచి నలుగురు సభ్యులతో ఓ కమిటీని రూపొందించింది.



ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలను పెంచడానికి కమిటీ ఇచ్చే సలహాల మేరకు ప్రభుత్వం ధరల తగ్గింపుకు సన్నాహాలు ప్రారంభిస్తుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ధరల తగ్గింపు చేపట్టడానికి గల అన్ని మార్గాలను కమిటీ అన్వేషిస్తోందని అధికారులు పేర్కొన్నారు. త్వరగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అడాప్షన్ కోసం కమిటీ ఇచ్చే సూచనలను ప్రభుత్వం పాటించనుంది. కమిటీ రెండో మీటింగ్ ఈ వారం చివరిలో ఉండనుందని అధికారులు చెప్పారు. గత నెల జరిగిన కమిటీ మీటింగ్ లో లొహియా ఆటో, హీరో ఎలక్ట్రిక్, ఆంపీయర్ వంటి ఎలక్ట్రిక్ వెహికిల్ మేకర్స్ పాల్గొన్నాయి.    



ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ-వీలర్ ధరలు పెట్రోల్ వెర్షన్ కంటే 1.5 టైమ్స్ ఎక్కువగా ఉన్నాయి. గత 6-7 ఏళ్లలో 4,50,000 ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ మాత్రమే భారత రోడ్లపై పరుగులు పెట్టాయి. స్థానిక సప్లయిర్ బేస్ ను అభివృద్ధి చేసి, ఎలక్ట్రిక్ వెహికిల్ కొనుగోలు ధరలను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాన్(ఎన్ఈఎమ్ఎమ్పీ) కింద 2020 కల్లా 6-7 మిలియన్ జనాభా ఎలక్ట్రిక్ టూ-వీలర్స్, ఫోర్-వీలర్స్ వినియోగించేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 1.5 శాతంకు తగ్గించనుంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ చార్జింగ్ కు అవసరమయ్యే బ్యాటరీల, ఇతర కాంపొనెంట్ల ధరలు తగ్గింపును కమిటీ కేంద్రానికి ప్రతిపాదించనుంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేయనుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top