ఓటుకు కోట్లు కేసులో కీలక నివేదిక

ఓటుకు కోట్లు కేసులో కీలక నివేదిక


హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు కీలక దశకు చేరుకుంది. స్టింగ్ ఆపరేషన్ లో ఉన్న వీడియో టేపులు నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నిర్ధారించింది. ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న వాయిస్ నిందితులదేనని తేల్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ నేత జెరూసలెం మత్తయ్య వాయిస్ తో సరిపోలినట్టు నిర్ధారించింది.



ఇక ఎఫ్ఎస్ఎల్ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాయిస్ నమూనాను సేకరించాలని భావిస్తున్నామని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడానికంటే ముందు చంద్రబాబు స్వర నమూనా తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు.



అసెంబ్లీ, మీడియా చానల్స్ ద్వారా నిందితుల స్వర నమూనాలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ పరీక్షకు పంపారు. స్టింగ్ ఆపరేషన్ ఆడియో, వీడియోల్లోని వాయిస్ తో నిందితుల వాయిస్ సరిపోలినట్టు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికను కోర్టుకు ఫోరెన్సిక్ అధికారులు సమర్పించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికను తమకు ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరనుంది.



టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెసన్ సన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. మే 30న బోయిగుడాలోని బిషప్ హ్యారీ సెబాస్టియన్ నివాసంలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా మాటలను ఐఫోన్, డిజిటల్ రికార్ల ద్వారా రహస్యంగా రికార్డు చేయించారు. మే 31న విక్రంపురి కాలనీలోని తన మిత్రుడు మాల్కమ్ టేలర్ నివాసంలోనూ టీడీపీ నాయకుల మాటలను రికార్డు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తూ ఏసీబీకి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు.



ఈ సందర్భంగా సెబాస్టియన్ ఫోన్ లో రికార్డైన వాటిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక యాప్ ద్వారా ఆయన రికార్డు చేసినట్టు గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులకు అదనంగా మరో సాక్ష్యం దొరికినట్టైంది. ఇందులో 516 కాల్స్ రికార్డు కాగా అందులో 102 కాల్స్ ఓటుకు కోటుకు కేసుకు సంబంధించినవే అని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదికతో ఈ కేసులో ఏసీసీ దర్యాప్తు వేగం పుంజుకోనుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top