మా జోలికొస్తే పాక్‌కు తగిన శాస్తి తప్పదు!

మా జోలికొస్తే పాక్‌కు తగిన శాస్తి తప్పదు! - Sakshi


సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ను భారత సైన్యం ఆదివారం తీవ్రంగా హెచ్చరించింది. తమ సైనికులను కనీసం తాకాలని ప్రయత్నించినా పాక్‌ తీవ్ర మూల్యం చెల్లించుకోకతప్పదని తేల్చిచెప్పింది. గత శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్‌ సెక్టర్‌లో బీఎస్‌ఎఫ్‌ జవాను గుర్నామ్‌ సింగ్‌ను పాక్‌ సైన్యం కవ్వింపు కాల్పుల్లో గాయపరచడంతో ప్రతీకారంగా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు తీవ్రస్థాయిలో కాల్పులు జరిపి ఏడుగురు పాక్‌ రేంజర్లను హతమార్చిన సంగతి తెలిసిందే.



పాక్‌ సైన్యం మొదట జరిపిన ఏకపక్ష కాల్పుల్లో గాయపడిన గుర్నామ్‌ సింగ్‌ రెండురోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయన భౌతికకాయానికి జమ్ములోని బీఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయంలో బీఎస్‌ఎఫ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ సైనిక లాంఛనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత 24 గంటలుగా సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొని ఉంది. కానీ ఈ  శాంతియుత వాతావరణం ఏ సమయంలోనైనా భగ్నం కావొచ్చు. అందుకు మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. పాక్‌ సైన్యం ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే.. దానిని దీటుగా ఎదుర్కొనేందుకు బీఎస్‌ఎఫ్‌ సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. సరిహద్దుల్లో ప్రస్తుత వాతావరణం తుఫాన్‌కు ముందు ప్రశాంతతలాంటిదా? అని అడిగితే.. ‘అది నేను ఇప్పుడు చెప్పలేను. కానీ మేం దేనినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అని అడిషనల్‌ డీజీ అరుణ్‌ కుమార్‌ తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top