టక టకా.. ఇటుకపై ఇటుక

టక టకా.. ఇటుకపై ఇటుక


ఇదంతా హైటెక్‌ కాలం. అన్ని పనులూ ఆటోమెటిక్‌గా, మన ప్రమేయం లేకుండా జరిగిపోవాలి. జరుగుతున్నాయి కూడా. అయితే ఇటుకపై ఇటుక పేర్చి... ఓ గోడకట్టాలంటే మాత్రం ఇప్పటికీ తాపీ మేస్త్రీ కావాల్సిందే. ‘మరేం పర్లేదు, ఈ పరిస్థితి ఇంకెన్నో రోజులు కాదులెండి’ అంటోంది ఆర్చీ యూనియన్‌ అనే చైనీస్‌ ఆర్కిటెక్చర్‌ సంస్థ. తాము ఇప్పటికే ఒకడుగు ముందుకేసి ఓ రోబోతో వంపులతో కూడిన అందమైన గోడను కట్టేశామని అంటోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆ రోబో నిర్మిత గోడే.



ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ రోబో ఇల్లు కట్టడం కోసం ఇలా ప్రత్యేకంగా తయారు కాలేదు. కార్ల ఫ్యాక్టరీలో వాడే యంత్రానికే డిజిటల్‌ మార్పులు చేసి దీనిని సిద్ధం చేశారు. కాకపోతే కారు విడిభాగాలను గుర్తించేందుకు ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్‌ను మార్చి.. రకరకాల ఆకారాల్లో ఉండే ఇటుకలను గుర్తించేలా చేశారు. ఇంతకీ ఈ భవనం ఎక్కడిదో చెప్పలేదు కదూ.. షాంఘైలో ఉంది. దీని పేరు ‘చీ షీ’. ప్రదర్శనలు గట్రా నిర్వహించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. అసలేం జరిగిందంటే, చాలాకాలంగా ఉన్న  భవనం స్థానంలో కొత్తది కట్టాలని ‘చీ షీ’ సొసైటీ నిర్ణయించింది. అయితే పాత ఇంటికి వాడిన ఇటుకలను వృథా చేయకూడదని... పాత జ్ఞాపకాలకు గుర్తుగా వాటిని కొత్త భవనంలో వాడాలని ఓ షరతు పెట్టింది.



అందుకు ఓకే అంది ఆర్చి యూనియన్‌. ఐదేళ్లు కష్టపడి కార్ల రోబోను కాస్తా ఇటుకలు పేర్చే రోబోగా మార్చింది. ఒకసారి రోబోను నిర్దిష్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన తరువాత మిగిలినదంతా ఆటోమెటిక్‌గా జరిగిపోయింది. అప్పటికే అందించిన డిజిటల్‌ ప్లాన్‌ ఆధారంగా రెండు వారాల్లో గోడ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇదే పని తాపీ మేస్త్రీ చేయాలంటే అసలు సాధ్యం కాదని, ఎందుకంటే చిన్నసైజులో ఉండే ఇటుకలను ఈ ఆకృతిలో పేర్చడం అంత సులువుకాదని ఆర్చీ యూనియన్‌ అంటోంది. ఆ మధ్య ఇల్లు మొత్తాన్ని ఒక రోజులో కట్టేసిన రోబో గురించి మీరు ‘వావ్‌ఫ్యాక్టర్‌’లో చదివారు కదా... అందులో ఇటుకల ప్రస్తావన అస్సలు లేదు. గుర్తుకు తెచ్చుకోండి.

 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top