బ్రెగ్జిట్‌పై గోవా వాసుల గోడు..

బ్రెగ్జిట్‌పై గోవా వాసుల గోడు..


పణాజి: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం పట్ల ప్రపంచం బాధంతా ఒకటైతే మన గోవా ప్రజల బాధ అందులో ప్రత్యేకమైనది. పణాజిలోని పోర్చుగీస్ కాన్సులేట్ కార్యాలయం ఎప్పుడూ చాంతాడంతా గోవా వాసుల క్యూలతో కళకళలాడేది. బ్రెక్జిట్‌కు బ్రిటన్ పౌరులు ఓటేసిన శుక్రవారం నుంచి మాత్రం ఈ కార్యాలయం బోసిపోయింది. రోజుకు 30 నుంచి 40 వరకు పాస్‌పోర్టులు జారీచేసే ఈ కార్యాలయం శుక్రవారం రెండు, మూడుకు మించి పాస్‌పోర్టులు జారీ చేయలేక పోయింది. కారణం పాస్‌పోర్టుల కోసం గోవా వాసులు ఆసక్తి చూపకపోవడమే.



గోవాను 450 సంవత్సరాలపాటు పాలించిన పోర్చుగీస్ 1961లో దాన్ని భారత్‌లో కలిపేసింది. అంతకుముందు పుట్టిన వారితోపాటు వారికి పుట్టిన పిల్లలు, ఆ పిల్లలకు పుట్టిన పిల్లలను పోర్చుగీసు పౌరులుగా పోర్చుగీస్ ప్రభుత్వం పరిగణిస్తూ వస్తోంది. అందుకనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారికి పోర్చుగీసు పాస్‌పోర్టులను జారీ చేస్తూ వస్తోంది. 1961 నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల మంది గోవా వాసులకు పోర్చుగీసు పాస్‌పోర్టులను జారీ చేసింది. పోర్చుగీసు యూరోపియన్ యూనియన్‌లో ఉండడం వల్ల పోర్చుగీసు పాస్‌పోర్టు కలిగిన వారు యూరోపియన్ యూనియన్‌లోని ఏ దేశంలోనైనా పనిచేసుకోవచ్చు, ఎక్కడైనా స్థిరపడవచ్చు. ఈ కారణంగా ప్రస్తుతం  పోర్చుగీసు పాస్‌పోర్టుతో దాదాపు పాతిక వేల మంది గోవా వాసులు బ్రిటన్‌లో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు.



యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఎక్కువ మంది గోవా వాసులు బ్రిటన్‌వైపే మొగ్గు చూపడానికి కారణం గోవా వాసులకు ఇంగ్లీషు భాష రావడం ప్రధాన కారణం. ఇప్పుడు బ్రిగ్జిట్ కారణంగా వారికి పోర్చుగీసు వీసాపై బ్రిటన్ వెళ్లి ఉద్యోగం చేయడానికి, అక్కడే స్థిరపడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామాన్ని వారు ఆశనిపాతంలా భావిస్తున్నారు. పోర్చుగీసు వీసాపై ఇక్ బ్రిటన్ వెళ్లేందుకు వీలు పడకపోవచ్చని, ముఖ్యంగా నైపుణ్యంలేని కార్మికులకు ఈ ఇబ్బంది తప్పదని గోవాలోని ఎన్‌ఆర్‌ఐ కమిషనర్ డాక్టర్ విల్‌ఫ్రెడా మిస్‌క్విటా వ్యాఖ్యానించారు. బ్రెగ్జిట్ కారణంగా తలెత్తే సమస్యలను ప్రపంచ దేశాలతోపాటు గోవా వాసులు కూడా భరించాల్సిందేనని ఆయన అన్నారు.



గోవాలోని పోర్చుగీసు కాన్సులేట్ కార్యాలయం శుక్రవారం నుంచి బోసిపోవడమే కాకుండా ఫోన్ ద్వారా ఎంక్వైరీలు కూడా బాగా తగ్గిపోయాయని కాన్సులేట్ అధికారులు తెలిపారు. బ్రెగ్జిట్ గురించి తెలియని దక్షిణ గోవా ప్రాంతానికి చెందిన ఓ 76 ఏళ్ల జెన్నీ ఫెర్నాండెజ్, ఆమె కూతురు కరోలిని శుక్రవారం నాడు కాన్సులేట్ కార్యాలయానికి వచ్చారు. జెన్నీ ఫెర్నాండెజ్ కొడుకు, కోడలు బ్రిటన్‌లో ఉద్యోగాలు చేస్తున్నారట. వారికి రెండేళ్ల బాబు కూడా ఉన్నారట. కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తుండడంతో తన రెండేళ్ల మనవడిని చూసుకోవడానికి బ్రిటన్ వెళ్లేందుకు ఆమె పోర్చుగీసు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారట.


బ్రెగ్జిట్ గురించి ఇప్పుడు తెలియడంతో ఆమె తనకు బ్రిటన్ వెళ్లేందుకు అవకాశం వస్తుందా, రాదా? అని దిగులు చెందుతున్నారు. చివరకు తన కొడుకు ఏం చెబితే అదే చేస్తామని ఆమె చెప్పారు. ఇక బ్రిటన్ వెళ్లేందుకు పోర్చుగీసు పాస్‌పోర్టు ప్రాసెస్ కోసం ఇక్కడికి వచ్చిన మరో ఇద్దరు పౌరులు కూడా బ్రెగ్జిట్ పరిణామంపై స్పందించారు. బ్రిటన్ వెళ్లేందుకు అవకాశం దొరక్కపోతే జర్మనీగానీ స్పెయిన్‌గానీ వెళతామని వారు చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top