విజేతను తేల్చేది ఈబీసీలే!

విజేతను తేల్చేది ఈబీసీలే! - Sakshi


రాష్ట్ర ఓటర్లలో 24% వారే 

రాజకీయ గుర్తింపునిచ్చిన నితీశ్ అంటే అభిమానం


 

లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మోదీకి బ్రహ్మరథం

ఈ ఎన్నికల్లో సీఎంకు జై కొడతారా? పీఎంకు మద్దతిస్తారా?

 

 బ్రాహ్మణులు, భూమిహార్‌లు, రాజ్‌పుట్‌లు వంటి అగ్రకులాలతో పాటు బనియాలు, కుష్వాలు, పాశ్వాన్‌లు, ముషాహర్‌లు బీజేపీ సారథ్యంలోని ఎల్‌జేపీ, ఆర్‌ఎస్‌ఎల్‌పీ, హిందుస్తానీ అవామ్ మోర్చాలతో కూడిన ఎన్‌డీఏను బలపరచాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇక యాదవులు, కుర్మీలు, ముస్లింలతో పాటు మహా దళితుల్లోని కొన్ని వర్గాలు.. ఆర్‌జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ల మహాకూటమికి మద్దతిస్తున్నారు. అయితే.. రాష్ట్ర ఓటర్లలో 24 శాతం మందిగా ఉన్న ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) వారు.. తాము ఎటువైపు అన్న విషయాన్ని బయటపెట్టటానికి నిరాకరిస్తున్నారు. ఎన్‌డీఏ- మహాకూటమి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ ఎన్నికల పోరాటంలో విజేతను నిర్ణయించేది.. ఈబీసీలే!



 మిగతా సామాజిక వర్గాలకు, ఈబీసీలకు మధ్య  తేడా ఉంది. వీరు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తరించి ఉన్నారు. కాని, వీరికి తమవాడని చెప్పుకునే నాయకుడు లేడు. దీంతో వీరు యాదవుల్లా, కుర్మీల్లా బలమైన వర్గం కాలేకపోయారు. అదీకాక, ‘పంచ్‌పనియా, పంచ్‌పోర్న, సోల్హంకన్’ ఇలా ఒక్కోప్రాంతంలో వీరిని ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. వాస్తవానికి..సీఎం, జేడీయూ నేత నితీశ్‌కుమార్ వల్లుఏ ఈబీసీలు ఓట్ల శక్తిగా రూపొందారు. 1950ల నుంచీ ఈబీసీల నిర్వచనం, పునర్నిర్వచనం సాగుతోంది. అయితే.. నితీశ్ 2005లో అధికారంలోకి వచ్చాక పంచాయతీ రాజ్ ఎన్నికల్లో, విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు ఇవ్వటం వంటి నిర్దిష్ట విధానాలు రూపొందించి అమలు చేశారు. ఈబీసీలకు ఒక ఉమ్మడి రాజకీయ గుర్తింపునిచ్చారు. దీంతో అనతికాలంలోనే వారు ఒక ప్రత్యేక ఓటు వర్గంగా రూపొందారు. అందుకే నితీశ్ అంటే వీరికి ప్రత్యేకమైన అభిమానం. తమ ఆకాంక్షలను తీర్చిన నేతగా నితీశ్‌ను వీరు అభిమానిస్తారు.



 లోక్‌సభ ఎన్నికల్లో ఈబీసీలు గంపగుత్తగా నరేంద్రమోదీకి మద్దతిచ్చారని, అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారు ఎన్‌డీఏకే పట్టం కడతారన్న వాదన కొందరు ఎన్నికల విశ్లేషకులు చేస్తున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో వారు ఓటేసింది మోదీకి అనుకూలంగానే! కానీ అది నితీశ్ వ్యతిరేక ఓటు కాదు. ఈ విషయాన్ని ఈబీసీలే తేల్చిచెబుతున్నారు. అందువల్ల ఇప్పుడు మోదీ, నితీశ్‌ల్లో ఎవరివైపు ఈబీసీలు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈబీసీల ఓటింగ్ ధోరణిని అంచనావేసేందుకు వారిని మూడు విభాగాలుగా విభజించవచ్చు. తెలి(నూనె తయారీదారులు, వర్తకులు- ఇది మోదీ సామాజిక వర్గం), పనేరి(తమలపాకులలు అమ్మేవారు), చిన్న వర్తకులైన సావ్.. తదితరులు తొలి వర్గం.



వడ్రంగులు, స్వర్ణకారులు, కుంహారులు తదితర కులవృత్తుల వారు రెండో వర్గం. పల్లకీలు మోసే బోయీలైన కహర్లు, మల్లా(జాలర్లు), నూనియా వంటి శ్రామిక కులాలు మూడో వర్గం. వ్యూహాత్మకంగా మోదీ సామాజికవర్గమైన ‘తెలి’ని ఈ ఎన్నికల ముందు నితీశ్ పునర్వ్యవస్థీకరించారు. ఈ మూడు వర్గాల వారు నితీశ్‌ను ఎంతగా అభిమానిస్తారో.. లాలూను అంతగా ద్వేషిస్తారు. లాలూ మళ్లీ అధికారంలోకి వస్తే యాదవ ప్రాబల్యం పెరుగుతుందన్న భయమూ వారిలో ఉంది. అయితే, లౌకిక కూటమి అధికారంలోకి వస్తే.. సీఎం అయ్యేది నితీశే కనుక లాలూ గురించి  భయపడాల్సిన అవసరం లేదన్నది వారిలో కొందరి వాదన.



అదీకాక, లాలూ కన్నా వారు బీజేపీకి ఎక్కువ భయపడ్తున్నారు. అగ్రకుల పార్టీగా వారు బీజేపీని భావిస్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే తాము అణచివేతకు గురైన రోజులు మళ్లీ వస్తాయని భయపడున్నారు. కోటాపై ఆరెస్సెస్ చీఫ్ భాగవత్ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకునపెట్టాయి. వాటికి లాలూ, నితీశ్ ప్రాచుర్య కల్పించారు. దాంతో, బీజేపీ అధికారంలోకి వస్తే నితీశ్ తమకు కల్పించిన సదుపాయాలు తొలగిపోతాయేమోనన్న భయం వారిలో ఏర్పడింది. అయితే, చిన్న వర్తకులు, చేతి వృత్తులవారు మాత్రం కొంతవరకు ఎన్‌డీఏకు మద్దతిస్తున్నారు. కానీ ఈబీసీల్లో బలమైన శ్రామిక కులాలు నితీశ్‌వైపే ఉన్నాయి. ఎన్నికలకు ఒకటి, రెండు వారాల ముందు, అప్పటి పరిస్థితి గమనించి, గెలుపు గుర్రాలెవరో గుర్తించి, వారివైపే నిలవాలని నిర్ణయించుకున్న వర్మూ ఈబీసీల్లో బలంగానే ఉంది.

 - (పీపుల్స్ పల్స్, రాజకీయ, ఎన్నికల అధ్యయన సంస్థ సౌజన్యంతో)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top