తొమ్మిదేళ్ల క్రితం అదృశ్యం.. ఇప్పుడు ప్రత్యక్షం!

తొమ్మిదేళ్ల క్రితం అదృశ్యం.. ఇప్పుడు ప్రత్యక్షం! - Sakshi


సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం బాలల దినోత్సవం రోజు అతడు కిడ్నాపయ్యాడు. మళ్లీ తన పుట్టినరోజున తిరిగి ఇంటికొచ్చాడు. తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. ఈ చిత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. భల్స్వా ప్రాంతానికి చెందిన ఫరీదా అనే మహిళ 2007 నవంబర్ 14వ తేదీన తన ఏడాది వయసున్న కొడుకు షహాబ్‌ను తీసుకుని బాబూ జగ్జీవన్ రాం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆ పిల్లాడిని బెంచి మీద కూర్చోబెట్టి.. టీకాలు వేయించడానికి అపాయింట్‌మెంట్ చీటీ తీసుకోడానికి లైనులో నిల్చున్నారు. అప్పటికి ఆమె మూడు నెలల గర్భిణి కావడంతో పిల్లాడిని ఎక్కువసేపు ఎత్తుకోలేక బెంచి మీద కూర్చోబెట్టారు. లైనులో ఉండగా ఓ స్నేహితురాలు పలకరిస్తే ఆమెతో మాట్లాడారు.



పది సెకండ్ల సేపు దృష్టి మళ్లిందో లేదో.. అంతలోనే బెంచి మీద పిల్లాడు అదృశ్యం అయిపోయాడు. పిల్లాడి తల్లితో పాటు ఆస్పత్రి సిబ్బంది కూడా మొత్తం గాలించినా ఎక్కడా కనిపించలేదు. దాంతో కృష్ణానగర్ పోలీసు స్టేషన్‌లో అతడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడి ఆచూకీ కనుక్కోలేక 2009లో కేసు మూసేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు రోజూ నాలుగు గంటల పాటు తమ కొడుకు కోసం వెతుకుతూనే ఉన్నామని అతడి తండ్రి అఫ్సర్ చెప్పారు. పిల్లాడి ఫొటోను ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరిగేవాడినన్నారు.



అలా పెట్టుకున్న ఫొటోయే అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఓల్డ్ సీలాంపూర్ ప్రాంతంలో ఈ దంపతులు ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడ బంధువులకు తమ కష్టం చెప్పుకొని, షబాబ్ ఫొటో చూపించారు. అలాంటి పోలికలతో ఉన్న ఓ పిల్లాడు తమ ఇంటిపక్కన ఉన్నాడని ఆయన చెప్పారు. దాంతో వెంటనే ఆ ప్రాంతంలో గాలించినా, పిల్లాడు దొరక్కపోవడంతో పోలీసులకు తెలిపారు. వాళ్లు ఆ ప్రాంతంలో స్కూళ్లను గాలించగా, అలాంటి పిల్లాడు కనిపించాడు. అతడిని రెండు రోజులు అనుసరించి, ఇల్లు కనుగొన్నారు. అతడి ప్రస్తుత తల్లిదండ్రులను గట్టిగా నిలదీశారు. తాము అతడిని దత్తత తీసుకున్నామని వాళ్లు చెప్పినా, అందుకు ఆధారాలు చూపించలేకపోయారు. చివరకు తామే అతడిని ఆస్పత్రి నుంచి ఎత్తుకొచ్చినట్లు అంగీకరించారు. దాంతో పోలీసులు పిల్లాడిని అసలు తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే అతడు వాళ్ల కొడుకేనా కాదా అని తేల్చడానికి డీఎన్ఏ పరీక్షలు చేశారు. దాని ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top