ఎన్నిక ఏకగ్రీవం

ఎన్నిక ఏకగ్రీవం


* జీహెచ్‌ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్  

* డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్


సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ఆ వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌కు వీరిద్దరు తప్ప వేరెవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. వారిద్దరికీ ఎంఐఎం కూడా మద్దతు ప్రకటించింది.



దాన్ని కూడా అధికారులు రికార్డు చేశారు. కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమం అరగంట లోపే పూర్తయింది.

 

తొలుత ప్రమాణం.. తర్వాత ఎన్నిక

ఉదయం 11 గంటలకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాల్‌లో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 11.10 నిమిషాలకు సమావేశానికి సరపడా కోరం ఉన్నట్లు ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం నాలుగు భాషల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత తెలుగులో అనంతరం ఉర్దూ, హిందీ, ఇంగ్లిషుల్లో ప్రమాణం చేయాలనుకున్న వారితో ప్రమాణం చేయించారు.



కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు మొత్తం 217 మంది ఉండగా, 109 మందికి పైగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాక కోరం ఉన్నట్లు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం ముగిశాక తొలుత మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్‌గా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును వెంకటేశ్వర  కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ప్రతిపాదించగా, మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య బలపరిచారు.



మేయర్ పదవికి ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో రామ్మోహ న్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తర్వాత డిప్యూటీ మేయర్‌గా బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్‌పేట కార్పొరేటర్ శేషుకుమారి ప్రతిపాదించగా, రామ్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.



వెంటనే అహ్మద్‌నగర్ కార్పొరేటర్ అయేషా రూబినా(ఎంఐఎం) లేచి.. మేయర్, డిప్యూటీ మేయర్లకు తమ పార్టీ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె లేవగానే తొలుత పోటీకి వేరే పేరు ప్రతిపాదిస్తారేమోనని కొందరు భావించారు. కానీ తాము కూడా మద్దతిస్తున్నట్లు చెప్పడంతో అధికారులు దాన్ని రికార్డు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన రామ్మోహన్, ఫసియుద్దీన్లకు  ప్రిసైడింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.44 మంది ఎక్స్ అఫీషియోలు హాజరు

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమానికి మొత్తం 150 మంది కార్పొరేటర్లు హాజరుకాగా 67 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులకుగాను 44 మంది మాత్రమే హాజరయ్యారు. లోక్‌సభ ఎంపీల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులెవరూ రాలేదు. 26 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఎక్స్ అఫీషియో సభ్యులెవరూ రాలేదు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తలసాని తదితరులు హాజరయ్యారు.



ఎన్నికల పరిశీలకులు అశోక్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, అదనపు కమిషనర్ (ఎన్నికలు) సురేంద్రమోహన్ ఇతర అధికారులు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్‌ను కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అభినందించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

 

మేయర్ ప్రొఫైల్

పేరు: బొంతు రామ్మోహన్ (42)

తండ్రి: బొంతు వెంకటయ్య

భార్య: శ్రీదేవి; కుమార్తెలు: కుజిత, ఉషశ్రీ

విద్యార్హతలు: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ

రాజకీయ అరంగేట్రం: 2001, టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి..

నిర్వహించిన పదవులు, నేపథ్యం: టీఆర్‌ఎస్ విద్యార్థి, యువజన విభాగం రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓయూ విద్యార్థి సంఘం నాయకుడిగా గుర్తింపు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు సన్నిహితుడిగా పేరుంది.

 

 

డిప్యూటీ మేయర్ ప్రొఫైల్

పేరు: బాబా ఫసియుద్దీన్(34)

విద్య: బీకాం

భార్య: హబీబా సుల్తానా

పిల్లలు: కుమార్తె, కుమారుడు

తండ్రి: బాబా షరీఫుద్దీన్

తల్లి: రజియా ఫాతిమా

రాజకీయ అనుభవం: 2001లో టీఆర్‌ఎస్‌లో చేరిన బాబా పార్టీ విద్యార్థి విభాగం గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top