మా వాడు చాలా బిజీగా ఉన్నాడు, అందుకే..

మా వాడు చాలా బిజీగా ఉన్నాడు, అందుకే.. - Sakshi


న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తానాపూర్‌ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటంపై ఆయన తల్లి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ వివరణ ఇచ్చారు. తన కొడుకు తీరికలేకుండా ఉన్నారని, అందుకే ఎన్నికల ప్రచారం చేయలేదని చెప్పారు. వరుణ్‌ దేశ వ్యాప్తంగా తిరుగుతూ, పలు యూనివర్శిటీలను సందర్శిస్తూ, విద్యార్థులను కలుస్తున్నాడని తెలిపారు. యూపీ నుంచే లోక్‌ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేనక కూడా ఎన్నికల ప్రచారంలో తక్కువగా పాల్గొన్నారు.



సోమవారంతో యూపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటి వరకు ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయి. చివరి, ఏడో దశ ఎన్నికలు జరగాల్సివుంది. ఈ నెల 11న కౌంటింగ్ జరగనుంది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా చాలామంది అగ్రనేతలు ప్రచారం చేశారు. మోదీ 23 ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. కాగా వరుణ్‌ ఎక్కడా కనిపించలేదు. గతేడాది రక్షణ వ్యవహారాల రహస్యాలను తెలుసుకునేందుకు వరుణ్‌ను ట్రాప్‌ చేశారని ఆరోపణలు వచ్చినపుడు బీజేపీ అండగా నిలవలేదని ఆయన కినుక వహించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. బీజేపీ తొలుత విడుదల చేసిన ప్రచారకర్తల జాబితాలో ఆయన పేరు లేదు. అయితే రెబెల్స్‌గా బరిలోకి దిగుతామని వరుణ్‌ మద్దతుదారులు హెచ్చరించడంతో ఆయన పేరును చేర్చారు. యూపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని వరుణ్‌ ఆశించినా.. పార్టీ పెద్దలు ఆయనను పక్కనబెట్టారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుందని మేనక గాంధీ చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top