తానొకటి తలిస్తే....

తానొకటి తలిస్తే.... - Sakshi


న్యూఢిల్లీ: తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు...పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీని ఏకాకిని చేద్దాం అని తలచి ఏకంగా 25 మంది కాంగ్రెస్ ఎంపీలను ఐదు రోజులపాటు సభ నుంచి  లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేసి బోల్తా పడ్డారు. సస్పెండైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు అండగా ఊహించని రీతిలో తొమ్మిది ప్రతిపక్ష పార్టీలు ఏకమై పాలకపక్ష బీజేపీని ఇరుకున పడేశాయి. తాము ఐదు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (యూ), రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాది పార్టీ, వామపక్షాలు, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ముస్లిం లీగ్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రకటించి చిన్నపాటి ప్రకంపనలనే సృష్టించాయి.



 పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసనతో ఇప్పటి వరకు కలసిరాని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఊహించని పరిణామమే. ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య భేటీ జరిగిన నాటి నుంచి పాలకపక్ష బీజేపీ పట్ల తృణమూల్ కాంగ్రెస్ మెతకవైఖరి అవలంబిస్తున్న విషయం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ నిరవధిక నిరసనతో విభేదించిన సమాజ్‌వాది పార్టీ కూడా ఇప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌పై కలసిరాక తప్పలేదు. ఈ తొమ్మిది ప్రతిపక్ష పార్టీలకు ఎవరి ఎజెండాలు వారికున్నా...భవిష్యత్తులో తమ పార్టీ సభ్యులను కూడా పాలకపక్షం ఇలాగే సస్పెండ్ చేయవచ్చన్న ముందు చూపుతో కాంగ్రెస్ ఎంపీలకు అండగా నిలిచాయి. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణం కేసుల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్య మంత్రి వసుంధర రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాల విషయమై పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పట్టు వీడకపోవడంతో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు తొలి రోజు నుంచే స్తంభించి పోతున్నాయి. అఖిలపక్షం సమావేశంలోనూ పాలక, ప్రతిపక్షాల మధ్య రాజీ కుదరలేదు. అనంతరం పాతికమంది కాంగ్రెస్ ఎంపీలను బహిష్కరించడం పార్లమెంట్ సమావేశాల పరిస్థితిని మరింత దిగజార్చాయి. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోనియా గాంధీ మండిపడుతున్నారు. నేరుగా మోది పేరుతోనే విమర్శలు కురిపిస్తున్నారు. తమ హయాంలో పార్లమెంట్ సమావేశాలకు అడ్డుపడిన బీజేపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయలేదని ఆమె అంటున్నారు. వాస్తవానికి యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 15 లోక్‌సభలో 14 మంది సభ్యులను, 13వ లోక్‌సభలో 12 మంది సభ్యులను సస్పెండ్ చేశారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top