ఫేక్‌ న్యూస్‌: ఆ విషయాన్ని బీజేపీ మరిచిపోయిందా?

ఆ విషయాన్ని బీజేపీ మరిచిపోయిందా?


సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ గురించి సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న ప్రచారాన్ని విశ్వసించ వద్దని, అవి నకిలీ వార్తలని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదివారం నాడు గుజరాత్‌ యువతను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఆ మరుసటి రోజు, అంటే సోమవారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను గుడ్డిగా నమ్మకండని, సంఘ విద్రోహ శక్తుల నుంచి నకిలీ వార్తలు వచ్చే ప్రమాదం ఉన్నందున, వాటిని ఒకటికి, రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని సూచించారు.


సోషల్‌ మీడియా విస్తరించిన నేటి ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా నకిలీ వార్తలు చెలామణి అవుతున్నాయి. అవి దేశాల మధ్యనే ఉద్రిక్తతలకు దారితీయడమే కాకుండా అమాయకుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. మరి బీజేపీ నాయకులే నకిలీ వార్తలను సష్టిస్తున్న విషయం, నకిలీ వార్తలపై స్పందిస్తున్న విషయాన్ని వారు మరిచిపోతున్నారా? బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు పరేశ్‌ రావల్‌ నకిలీ వార్తను నమ్మి జర్నలిస్ట్, రచయిత్రి అరుంధతీరాయ్‌ని దుర్భాషలాడారు. కశ్మీర్‌లో ఓ సైనిక జీపు బానెట్‌కు ఓ మిలిటెంట్‌ను కట్టేసి తీసుకెళ్లిన సంఘటనను ప్రస్తావిస్తూ, ఆ మిలిటెంట్‌కు బదులుగా అరుంధతీరాయ్‌ని కట్టేసి తీసుకెళ్లాల్సిందంటూ ఆయన ట్వీట్లు పెట్టారు. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలంటూ బీజేపీ కార్యకర్తలు కూడా ఆయన బాటలో స్పందించారు. వారికి అంత ఆగ్రహం రావడానికి కారణం నకిలీ వార్తే.


‘భారత్‌లోని 70 లక్షల మంది సైనికులు కలిసికట్టుగా దాడిచేసినా కశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న మిలిటెంట్లను ఏమీ చేయలేరు’ అని అరుంధతీరాయ్‌ ఇటీవల కశ్మీర్‌ పర్యటన సందర్భంగా ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇస్లామాబాద్‌’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారన్నది ఆ నకిలీ వార్త సారాంశం. ఈ వార్త నిజమైతే ఈ వార్తను ప్రచురించిన ‘పోస్ట్‌కార్డ్‌ డాట్‌ న్యూస్‌’ ది టైమ్స్‌ ఆఫ్‌ ఇస్లామాబాద్‌ లింక్‌ ఇచ్చేది కదా? గతంలో ఎన్నో తప్పుడు వార్తలను ప్రచారం చేసిన ‘పోస్ట్‌కార్డ్‌ డాట్‌ న్యూస్‌’ పక్కా బీజేపీ బాకా వెబ్‌సైట్‌ అనేది అందరికీ తెల్సిందే. ఆ తర్వాత అరుంధతీరాయ్‌ స్పందనతో ఆమె కశ్మీర్‌కే వెళ్లలేదని, ఆమె ఏ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని తెల్సింది. ఈ వార్తను ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇస్లామాబాద్‌’ కూడా ఖండించడంతో పరేశ్‌ రావెల్‌ నాలుక్కరుచుకున్నారు.


మాజీ ఉప రాష్ట్రపతి మహ్మద్‌ హమీద్‌ అన్సారీపైనా బీజేపీ అధికార ప్రతినిథి శంభిత్‌ పాత్ర నకిలీ వార్తపైనే నోరు పారేసుకున్న విషయాన్ని బీజేపీ నాయకులు అప్పుడే మరచిపోయారా? సుప్రీంకోర్టులో తమ ప్రభుత్వం వ్యతిరేక వైఖరి అవలంబించినప్పటికీ ‘రైటు టు ప్రైవసీ’కి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఇటీవల వ్యాఖ్యానించడం తప్పుడు వార్త కాకపోవచ్చుగానీ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తోంది కదా! పశ్చిమ బెంగాల్‌లో హిందువులు, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగినప్పుడు వాటిని మరింత రెచ్చగొట్టడానికి బీజేపీ సమాచార సాంకేతిక విభాగం, అంటే పార్టీ ఐటీ అధిపతి అమిత్‌ మాలవీయ ఎన్ని నకిలీ వార్తలను ప్రచారం చేయలేదు! 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల ఫొటోలను తీసుకొని కొత్తగా బెంగాల్‌లో ప్రభుత్వ ఆస్తులను తగులబెడుతున్న ముస్లింలు అనే శీర్శికతో, పట్టపగలు ఓ హిందూ యువతిని ముస్లిం యువకులు రేప్‌ చేస్తున్నారంటూ ఓ మరాఠి చిత్రం షూటింగ్‌ స్టిల్‌తో సోషల్‌ మీడియాలో ఎంత ప్రచారం చేయలేదు?


నకిలీ వార్తల చెలామణిని అరికట్టాలనే చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు, మంత్రులకు ఉన్నట్లయితే ముందుగా వారు తమ మనుషులపై చర్యలు తీసుకోవాలి. నకిలీ వార్త కారణంగా ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం ముస్లిం యువకుడిని జనమే కొట్టి చంపారు. నకిలీ వార్తల కారణంగా గోరక్షణ పేరిట దళితులపై దాడులు జరిగాయి. నకిలీ వార్తల కారణంగా అమెరికా, ఖతార్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి దౌత్య సంబంధాలు తెంచుకోవడం వరకు వెళ్లింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ విజయానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ తీవ్రంగా కషి చేశారంటూ వచ్చిన తప్పుడు వార్తల నుంచి ఇరు దేశాలు ఇప్పటికీ బయటపడ లేకపోతున్నాయి. ఈ అంశంపై ఏర్పడిన దర్యాప్తు సంఘం ప్రధాన టార్గెట్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక అంటూ సోషల్‌ మీడియాలో తాజాగా వచ్చిన వార్తను ట్రంప్‌ స్వయంగా ఖండించాల్సి వచ్చింది. దర్యాప్తునకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మొన్నటికి మున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ బ్లిగ్‌ టర్న్‌బిల్‌ సిడ్నీలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు వెళ్లినప్పుడు ఆయన ఓ చేతిలో బీరు గ్లాసు, మరో చేతిలో మునిమనుమరాలును ముద్దాడుతున్నట్లు ఫొటోను మార్ఫింగ్‌చేసి పెట్టారు.


అమెరికా, రష్యాలతోపాటు జర్మనీ, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, స్వీడన్, మయన్మార్, మెర్సినోడియాలో నకిలీ వార్తలు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. ఇలాంటి వార్తలను నియంత్రించేందుకు అమెరికా, జర్మనీ లాంటి దేశాలు ప్రత్యేక సైబర్‌ బృందాలను ఏర్పాటు చేశాయి. భారత్‌లో అలాంటి బృందాలు లేవు. ఆధారాలుంటే పరువునష్టం దావాలు వేయడం ఒక్కటే దారి. తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారికి కఠిన శిక్షలు విధిస్తూ చట్టం తీసుకురావాలి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ వార్తలను అరికట్టాలి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top