సరిలేరు నాకెవ్వరూ....

సరిలేరు నాకెవ్వరూ....


లాస్ ఏంజెలిస్: బికినీ భామలతో ఖరీదైన స్కాచ్ విస్కీల నిషాలో ఖుషీ...ఖుషీగా అణుక్షణం జీవిస్తున్న కోటాను కోట్ల రూపాయల అధిపతి టోని టౌటౌని తన విలాసా జీవితానికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం ద్వారా ‘ఇన్‌ష్టాగ్రామ్’లో అలజడి సృష్టిస్తున్నారు. సరస సల్లాపాలలో సరిలేరు నాకెవ్వరూ... అంటూ వివిధ భంగిమల్లో అందమైన భామలు, సూపర్‌కార్లు, ప్రైవేట్ జట్ విమానాల ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ఏడున్నర లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు.



ఇన్‌స్టాగ్రామ్ ‘రారాజు’ కిరీటాన్ని దక్కించుకోవడానికి మరెంతో దూరంలో లేరు. ప్రస్తుతం ఈ కిరీటం ఎనిమిది లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన ‘ప్లే బాయ్’ డాన్ బిల్జేరియన్ పేరిట ఉంది. సూపర్ రిచ్ డాన్ బిల్జేరియన్ తన స్నేహితుడేనని, ఆయన పేరిటనున్న ‘కింగ్ ఆఫ్ ది ఇన్‌స్టాగ్రామ్’ టైటిల్‌ను తాను దక్కించుకోవాలనే తాపత్రయం ఏమీ లేదని, తన స్టైల్ చూసి ఫాలోవర్స్ పెరుగుతున్నారని పెళ్లికాని 42 ఏళ్ల టోని తెలిపారు.



‘అందరు కలలుగనే జీవితాన్నే నేనూ అనుభవిస్తున్నాను. నాలాగా జీవించాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. పురుష పుంగవుడిగా నేను ఎంతో మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాను. నేను కోరుకున్న అమ్మాయెవరూ కూడా ఇంతవరకు నన్ను కాదనలేదు. దటీజ్ మై లైఫ్ స్టైల్’ అని టోని తన గురించి తాను చెప్పుకుంటున్నారు. లాస్ ఏంజెలిస్‌కు చెందిన వ్యాపారవేత్త టోని తన 19 ఏళ్ల వయస్సులోనే కాలిఫోర్నియాలోని హాలీవుడ్‌లో నైట్ క్లబ్‌ను కొనుగోలు చేయడం ద్వారా కోటానుకోట్ల రూపాయలకు ఎదిగిపోయాడు. ఆయనకు ప్రస్తుతం అమెరికాలో పలు కార్ల డీలర్‌షిప్, రెస్టారెంట్లు, పబ్‌లు, బార్లు ఉన్నాయి.



‘ధనవంతుడివై దుర్భర జీవితాన్ని గడపడం కన్నా పేదవాడిగా ఉంటూ సంతోషంగా జీవించడం ఉత్తమమని పెద్దలంటారు. అందుకనే సూపర్ డూపర్ రిచ్ కాకుండా రాజీపడి మూడీగా బతుకుతున్నాను’ అనే ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఖాతా మొదలవుతోంది.

ఆయనపై ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న విమర్శల గురించి ప్రశ్నించినప్పుడు ‘అవును నన్ను కొంతమంది ఫెమినిస్టులు విమర్శిస్తారు నిజమే. ఎందుకంటే నాలో వారికి సమస్యలు కనిపిస్తాయి. అయినా సరే అన్ని రకాల పనులు చేయడానికి నేను సిద్ధమే’ అని సమాధానం ఇచ్చారు. ‘అట్ ది రేటాఫ్ లూనాటిక్’ పేరుతో ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఉంది. ఎవరి పిచ్చి వారికానందం!

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top