బిహార్ ఎన్నికల వేళ ‘బీఫ్’ వివాదం!

బిహార్ ఎన్నికల వేళ ‘బీఫ్’ వివాదం! - Sakshi


పశుమాంసం చుట్టూ దేశ రాజకీయాలు

 

 దేశంలో ఒక్కసారిగా ‘బీఫ్’ రాజకీయాలు ఊపందుకున్నాయి. గోసంరక్షణ వర్సెస్ గోమాంస భక్షణపై చర్చ మొదలైంది. బీఫ్నిర్వచనం, పశుమాంసం పరిధిలోకి ఏయే జంతువుల మాంసం వస్తుంది? అనే అంశాలూ చర్చకొచ్చాయి. బిహార్ ఎన్నికల్లోనూ అభివృద్ధి, అవినీతి పక్కకెళ్లి.. ప్రచార తెరపైకి ‘ఆవు’ వచ్చి చేరింది. ఈ అంశం ఇంత అకస్మాత్తుగా ప్రాధాన్యం సంతరించుకోవడం వెనుక అసలు కారణం కూడా బిహార్ ఎన్నికలేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మత ప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకే  ‘బీఫ్’ను తెరపైకి తెచ్చారని వారంటున్నారు.  మరోవైపు, గోమాంసం తిన్నాడన్న ఆరోపణలపై గతవారం ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో ఓ వ్యక్తి హత్యకు గురవడం అక్కడ ఉద్రిక్తతలకు, దేశవ్యాప్త చర్చకు దారితీసింది. గోమాంసాన్ని  నిషేధిస్తూ కశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గోమాంస గొడవపై విశ్లేషణ..               

- సెంట్రల్ డెస్క్

 

 ఎగుమతుల్లో మొదటి స్థానం..

 భారతదేశంలో గోమాంసం సహా పశుమాంస భక్షణ అనాదిగా చర్చనీయాంశమే. హిందువులు గోహత్య మహాపాతకంగా భావిస్తారు. గోవధ నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లోని ఆర్టికల్ 48లో పొందుపర్చారు. ఒకవైపు పవిత్ర గోమాతగా పూజలందుకుంటూనే, మరోవైపు, పెద్దఎత్తున దేశీయంగా, ఎగుమతులపరంగా గోమాంసం వినియోగమవుతోంది. దేశంలో సగటున 36.43 లక్షల టన్నుల పశుమాంసం ఉత్పత్తి అవుతుండగా, అందులో 19.63 లక్షల టన్నులు దేశీయంగా, 16.80 లక్షల టన్నులు ఎగుమతుల పరంగా వినియోగమవుతున్నాయి. పశుమాంస ఉత్పత్తిలో భారత్ బ్రెజిల్ తరువాత రెండో స్థానంలో ఉంది. దేశీయ వినియోగంలో ఏడవ స్థానంలో, ఎగుమతుల్లో 24 లక్షల టన్నుల ఎగుమతుల్తో(2014-15 ఆర్థిక సంవత్సరంలో) ప్రథమ స్థానంలో నిలుస్తోంది.



 అత్యధిక రాష్ట్రాల్లో గోవధ నిషేధం..

 2015 మార్చిలో బీజేపీ పాలిత మహారాష్ట్ర, హరియాణాలు బీఫ్ అమ్మకాలు నిషేధించడంతో వివాదం మొదలైంది. ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టల్ని మార్చారు. ఆ సమయంలో మహారాష్ట్ర పశుసంరక్షణ(సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ బిల్లును 1996లోనే శివసేన, బీజేపీ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం రాష్ట్రంలో దూడలు, ఎద్దులను చంపడమూ నిషేధమే. గోవధను మహారాష్ట్ర 1976లోనే నిషేధించింది.



యూపీ, తమిళనాడు, రాజస్తాన్, పంజాబ్, ఒడిశా, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఢిల్లీ, బిహార్ లలో గోవధ నిషేధ చట్టాలున్నాయి. అయితే వాటి అమలు ఆ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటోంది. రాజస్తాన్, పంజాబ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో అన్ని రకాల పశువుల వధను నిషేధించే కఠిన చట్టాలున్నాయి. ఆవులు, ఆవుదూడలు, లేగదూడలు మినహా వ్యవసాయ, ఇతర అవసరాలకు ఉపయోగపడని, ‘వధకు అర్హమైనవి’ అన్న సర్టిఫికెట్ ఉన్న పశువులను వధించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అనుమతి ఉంది. పశ్చిమబెంగాల్, కేరళ, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో పశువధపై నిషేధం లేదు.



విశేషమేమిటంటే.. బీఫ్ అమ్మకాన్ని, వినియోగాన్ని నిషేధించే జాతీయ చట్టమేమీ లేదు. రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాల్లోనూ పశుమాంసం ఆహారంగా వాడడంపై నిషేధమూ లేదు. దేశ జనాభాలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు పశుమాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. సాధారణంగా బీఫ్ వాడకం, వ్యాపారంలోనూ ముస్లింలది ప్రధాన పాత్ర. ఈ నేపథ్యంలోనే బీఫ్ బ్యాన్ మతం రంగు పులుముకుంటోంది. పశుమాంసానికి సంబంధించి ఇటీవల వివాదాస్పదమైన కొన్ని ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరగడం ఈ వాదనకు బలాన్నిస్తోంది. పశువధ వల్ల వ్యవసాయం దెబ్బతింటుందన్న వాదనను కొందరు కొట్టేస్తున్నారు. వ్యవసాయంలో ప్రగతి సాధించిన బెంగాల్‌లో పశువధపై కఠిన నిషేధం లేదంటున్నారు.



 ఇటీవలి వివాదాస్పద ఘటనలు..

►జైనుల పండగ వల్ల సెప్టెంబర్ 17, 18, 27 తేదీల్లో మాంసం, చేపల అమ్మకాలను నిషేధిస్తూ రాజస్తాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

►జమ్మూకశ్మీర్లో బీఫ్ అమ్మకాలను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

►సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు, వారం రోజుల పాటు ఆవు, గేదె, ఎద్దు, మేక.. తదితర జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వధించడాన్ని ముంబై పోలీసులు నిషేధించారు. అధికారిక వధశాల్లలో వాటిని చంపడాన్ని నిషేధించలేదు. ముంబై పోలీసుల నిర్ణయంపై బీజేపీ మిత్రపక్షం శివసేన, ప్రతిపక్షం ఎమ్‌ఎన్‌ఎస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసి, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.



 మతఘర్షణలపై కఠినంగా ఉండండి: కేంద్రం

 న్యూఢిల్లీ: మతసామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వారిపట్ల, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి లాభపడాలని చూసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దాద్రీ ఘటనతో పాటు దేశంలో పలుచోట్ల మతపరమైన ఘర్షణలు చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు  హోంశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

 

 గెలిస్తే గోవధపై నిషేధం: బీజేపీ

 పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తే రాష్ట్రంలో గోవధపై నిషేధం విధిస్తామని బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ చెప్పారు. 14 ఏళ్లలోపు వయసున్న గోవులను వధించకూడదని ఇప్పటికే బిహార్‌లో చట్టం అమలులో ఉందని,  గత ప్రభుత్వాలు దీన్ని సమర్థంగా అమలు చేయలేదని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికలు గొడ్డుమాంసం తినడంలో తప్పులేదనే వారికీ, గోవధపై నిషేధం ఉండాలని కోరుకునే వారికీ మధ్య పోరాటంగా మారాయన్నారు.

 

 మోదీ ఓ ధృతరాష్ట్రుడు: లాలూ

 హాజీపూర్: యూపీలో జరిగిన దాద్రీ ఘటనపై ప్రధాని మౌనాన్ని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ఆక్షేపించారు.  మోదీని ధృతరాష్ట్రుడితో పోల్చారు. ‘హస్తినలో కూర్చొన్న ఈ కలియుగ ధృతరాష్ట్రుడు అంధుడే కాదు మూగ, చెవిటి కూడా. పైకే గంభీర ఉపన్యాసాలు. లోపల పిరికివాడు. మాట్లాడాల్సిన అవసరం ఉన్నపుడు మౌనాన్ని ఆశ్రయిస్తాడు. సమాజాన్ని అల్లకల్లోలం చేయడానికి ధుర్యోధనులకు బాహటంగా అనుమతిచ్చేశారు’ అని సోమవారం ఓ సభలో అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top