ఎంతైనా.. లాలు కొడుకు కదా!

ఎంతైనా.. లాలు కొడుకు కదా! - Sakshi


బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్‌కు ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లిద్దరూ కూడా ప్రస్తుత బిహార్ ప్రభుత్వంలో మంత్రులే. ఒకరు ఉప ముఖ్యమంత్రి కూడా. కానీ ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లే కనిపిస్తున్నారు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు వేటిలోనూ వాళ్లిద్దరూ కనిపించడం లేదు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలకు ఉచితంగా వై-ఫై సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం ఓ పెద్ద కార్యక్రమంలో ప్రకటించారు. అయితే, ఇంత ముఖ్యమైన ప్రకటన సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తేజస్వి యాదవ్, మంత్రి తేజ్ ప్రతాప్ ఇద్దరూ సీఎం పక్కన లేరు. కావాలనే వాళ్లు ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది.



నితీష్ కుమార్ వరుసగా మూడోసారి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 2015 ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిందన్నది నిర్వివాదాంశం. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆర్జేడీ, జేడీయూ పోటీ చేసి బీజేపీ విజయాన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దాంతో బాగా యువకులైన లాలు కొడుకులిద్దరికీ కేబినెట్‌లో బెర్తులు లభించాయి.



బుధవారం నాటి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా పాల్గొని ప్రసంగించాల్సి ఉందని, అయితే ఆయన కార్యక్రమం చిట్ట చివరి నిమిషంలో రద్దయిందని బిహార్ విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి చెప్పారు. ఇంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు కార్యక్రమాన్ని నితీష్‌ కుమార్ బాగా ప్రశంసించారు. అది లాలుకు ఏమాత్రం నచ్చలేదు. నితీష్, తాను రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్నామని.. ఇక యువ నాయకులు తమ స్థానాన్ని తీసుకోవాలని లాలు ఈ మధ్య అన్నారు. అయితే దీనిపై నితీష్ ఏమీ వ్యాఖ్యానించలేదు. ఇక మంత్రులిద్దరిలో పెద్దవాడైన తేజ్‌ప్రతాప్ యాదవ్ తరచు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతుంటారు. దాంతో ఆయనకు ఈ పదవి ఇష్టం ఉన్నట్లు లేదని ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top