పాకిస్తాన్‌కు భారీ షాక్‌

పాకిస్తాన్‌కు భారీ షాక్‌


ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ను తమ దేశంలోనే అరెస్ట్‌ చేశామని చెబుతున్న పాకిస్తాన్‌ మాటలు అబద్దమని తేలిపోయింది. జాధవ్‌ను ఇరాన్‌లో పట్టుకున్నామని పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మాజీ అధికారి, రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అంజాద్‌ షోయబ్‌ వెల్లడించారు. జాధవ్‌ను తమ దేశంలో అరెస్ట్‌ చేయలేదని ఆయన తెలిపారు.



అతడిని బలూచిస్తాన్‌లో అరెస్ట్‌ చేసినట్టు పాకిస్తాన్‌ చెబుతూ వస్తోంది. ఇరాన్‌ నుంచి తమ దేశంలోకి చొరబడుతుండగా గతేడాది మార్చి 3న అరెస్ట్‌ చేసినట్టు పేర్కొంది. ఐఎస్‌ఐ మాజీ అధికారి ప్రకటనతో దాయాది దేశానికి దిమ్మతిరిగినట్టైంది. నావికాదళం నుంచి పదవీ విరమణ చేసిన ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాధవ్‌ను కిడ్నాప్‌ చేసి అతడిపై పాక్‌ గూఢచర్యం ఆరోపణలు మోపిందని భారత్‌ పేర్కొంది.



మరోవైపు జాధవ్‌ కేసుపై త్వరగా విచారణ చేపట్టాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) పాకిస్తాన్‌ అభ్యర్థించింది. జాధవ్‌కు పాక్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తుది తీర్పు వచ్చేంతవరకు శిక్ష అమలు చేయవద్దని పాకిస్తాన్‌కు ఐసీజే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో త్వరగా విచారణ చేపట్టాలని పాక్‌ కోరుతోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top