బాసర ఆలయంలో అనూహ్య సంఘటన

బాసర: బీరువాలోనే అమ్మవారి విగ్రహం!


- పోలీసుల సమక్షంలో బయటికి తీసిన అధికారులు

- ఉత్కంఠకు తెర.. ఘటనపై సర్వత్రా విస్మయం




నిర్మల్‌:
బాస‌ర‌లోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గడిచిన 10 రోజులుగా కనిపించకుండా పోయిన అమ్మవారి ఉత్సవ విగ్రహం.. ఆలయంలోని బీరువాలో ప్రత్యక్షమైంది. సోమవారం పోలీసుల సమక్షంలో ఆలయ అధికారులు బీరువా నుంచి విగ్రహాన్ని, అలంకరణ సామాగ్రిని బయటికి తీయడంతో ఉత్కంఠకు తెరపడినట్లైంది. ఆలయ ప్రధాన అర్చకుడు, మరో పూజారి కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తరలించారనే ఆరోపణలపై నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే.



అసలేం జరిగింది? నిత్యం లక్షలాది మంది భక్తులు సందర్శించే బాసర ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కనిపించకుండా పోయాయి. ఆగస్టు 8 తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మరో పూజారితో కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తరలించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఓ పాఠశాలకు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ పూజలు, అక్షరాభాస్యం చేయించినట్లు వెల్లడైంది. దీంతో ఆ ఇద్దరికీ నోటీసులు జారీ అయ్యాయి.



బీరువాలోనే అమ్మవార్లు: పూజారులకు నోటీసులు ఇచ్చి పదిరోజులు గడిచినా, అమ్మవారి విగ్రహం ఎక్కడుందనే దానిపై స్పష్టతరాలేదు. బాసర ఆలయంలోపల రెండు బీరువాలు ఉండగా సోమవారం తహసిల్దార్‌, పోలీసుల సమక్షంలో ఆలయ అధికారులు వాటిని తెరిచారు. మొద‌టి బీరువాలోనే వెండి ప‌ళ్లెంలో సరస్వతి అమ్మవారి ఉత్సవమూర్తి, అలంక‌ర‌ణ సామగ్రి కనిపించాయి. ఎట్టకేలకు ఆలయంలోని బీరువాలోనే అమ్మవారి విగ్రహం ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విగ్రహం మాయం కేసులో ఆలయ అధికారి ప్రమేయం కూడా ఉందనే వార్తలు వచ్చాయి. వీరిపై కేసులు నమోదు చేస్తారా, లేదా అన్నది తెలియాల్సిఉంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top