మోదీకి ఒబామా ఫోన్.. ఏం చెప్పారు?

మోదీకి ఒబామా ఫోన్.. ఏం చెప్పారు? - Sakshi

మరొక్క రోజులో తన పదవీకాలం పూర్తయిపోతోందనగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. భారత్ - అమెరికా దేశాల మధ్య గల సంబంధాలను పెంపొందించడంలో భాగస్వామ్యం వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా రక్షణ రంగం, పౌర-అణు ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలు తదితర విషయాలపై ఇద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. 

 

ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగ ప్రాధాన్యాలు, భారతదేశాన్ని అమెరికాకు ప్రధాన రక్షణ రంగ భాగస్వామిగా గుర్తించడం, వాతావరణ మార్పు తదితర అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించుకున్నట్లు ఆ ప్రకటనలో చెప్పారు. నరేంద్రమోదీ 2014 సంవత్సరంలో భారత ప్రధానిగా ఎన్నికైనప్పుడు ఆయనకు ఫోన్ చేసి అభినందించిన వారిలో బరాక్ ఒబామా అందరికంటే ముందున్నారు. అప్పుడే ఆయన మోదీని వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు కూడా. 

 

2014 సెప్టెంబర్‌లో ఒబామా, మోదీ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్లిద్దరి మధ్య ఎనిమిది సార్లు సమావేశాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని ఇన్నిసార్లు వాళ్ల పదవీకాలంలో కలవడం ఇదే మొదటిసారి. ఇద్దరి మధ్య చాలా దృఢమైన బంధం ఉందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి నిషా దేశాయ్ బిస్వాల్ తెలిపారు. ఇద్దరికీ పరస్పరం గౌరవం ఉందని, ఒకరి విలువలను ఒకరు గౌరవించుకుంటారని ఆమె చెప్పారు.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top