గ‘మ్మత్తు’గా బీర్‌ర్‌ర్‌ర్‌ర్‌ యోగా!

గ‘మ్మత్తు’గా బీర్‌ర్‌ర్‌ర్‌ర్‌ యోగా!


‘తకిట తదిమి తకిట తదిమి తందాన’.. అంటూ మందు తాగుతూ బావి మీద భరతనాట్యం చేస్తాడు కమల్‌హాసన్‌ సాగరసంగమం సినిమాలో. మనవాళ్ల మాటేమో గానీ.. ప్రపంచవ్యాప్తంగా జనాలకు ఇది బాగా నచ్చినట్లుంది. కాకపోతే మందుకు బదులుగా బీర్‌ తాగుతూ, భరతనాట్యానికి బదులుగా యోగా చేస్తున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ప్రస్తుత ట్రెండ్‌ ఇదే.



బీర్‌ యోగా అంటూ పిలుచుకుంటున్న ఈ లేటెస్ట్‌ ఫిట్‌నెస్‌ ట్రెండ్‌పై జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, థాయ్‌లాండ్‌ వంటి చాలా దేశాల యువతలో క్రేజ్‌ పెరుగుతోంది. పతంజలి యోగాతో మొదలై పవర్‌ యోగా, విక్రమ్‌ యోగా, అయ్యంగార్‌ యోగా, గోట్‌ యోగా అంటూ ఎన్నో కొత్త రకాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు బీర్‌ యోగా శకం ఆరంభమైనట్లు కనిపిస్తోంది. ఇది మన దేశంలోనూ విస్తరిస్తోంది.



అత్యున్నత స్థాయి చేతనను చేరుకోవడానికి యోగా వేదాంతంతో బీర్‌ ఆహ్లాదాన్ని మిళితం చేశామని.. ఇది బీర్‌–యోగా అనే ‘ఇద్దరు గొప్ప ప్రేమికుల పెళ్లి’అని జర్మనీకి చెందిన యోగా టీచర్లు ఎమిలీ, ఝులా అభివర్ణిస్తున్నారు. యోగాను ఇష్టపడే బీరు ప్రేమికులు, బీర్‌ను ఇష్టపడే యోగులు.. ఇలా ఆసక్తి ఉన్న వారందరూ బీర్‌ యోగా చేయవచ్చని చెబుతున్నారు. బీర్‌ తాగడాన్ని యోగాసనాల్లోకి మార్చడమే బీర్‌ యోగా అని యోగా టీచర్‌ నషీ వెంకటరామన్‌ పేర్కొన్నారు. కొంచెం బీర్‌ తాగి ఆసనం వేయడం, ఆసనాలు వేసేటపుడు బీర్‌ బాటిల్‌ను బ్యాలెన్స్‌ చేయడం ఉంటాయని చెప్పారు.



బీర్‌ యోగా నేర్చుకునేందుకు ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. బీర్‌ తాగుతూ సూర్య నమస్కారాలు చేయడం, తలపై బీర్‌ బాటిల్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ వృక్షాసనం, పద్మాసనం, నటరాజాసనం.. తదితర అన్ని ఆసనాలనూ నేర్పిస్తున్నారు. యోగా మన సంప్రదాయ వారసత్వం కాబట్టి బీర్‌కు బదులుగా భారతీయ మద్యపానీయమైన భంగు తాగుతూ యోగా చేస్తే ఉత్తమమని ఆన్‌లైన్‌లో కొందరు సూచనలు చేస్తుండటం కొసమెరు పు!    – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top