జెండా, అజెండా పక్కనపెట్టి..

జెండా, అజెండా పక్కనపెట్టి.. - Sakshi


‘10న బంద్’పై ఒక్కటైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ

విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు


 

 హైదరాబాద్: ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను ఉమ్మడిగా విజయవంతం చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. జెండా, అజెండా పక్కనబెట్టి మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు బంద్‌పై దృష్టి సారించాయి. ఈ మేరకు ఆ పార్టీల నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ బంద్ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం శాసనసభ ఆవరణలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. బంద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నందున ప్రజలు కూడా పూర్తిగా బంద్‌లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.



రైతులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించేందుకు రుణమాఫీని ఏక మొత్తంగా అమలు చేయాలన్న డిమాండ్‌తో బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. రైతులకు జీవితంపై నమ్మకం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రోజుకు పది మంది దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం మినహా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం, రైతు సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. అఖిల పక్షాలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విద్య, వ్యాపార, రవాణా సంస్థలకు పిలుపునిచ్చారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top