2022 నాటికి వాటి అవసరమే ఉండదట!

2022 నాటికి వాటి అవసరమే ఉండదట! - Sakshi


న్యూఢిల్లీ: డిజిటల్  లావాదేవాలకు లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో రానున్నకాలంలో  ఏటీఎం కార్డులు, మెషీన్లకు ఇక కాలం చెల్లినట్టేనట.  పెద్ద నోట్ల రద్దు తరువాత, 2022  నాటికి ఏటీఎంకార్డులు, పీఓఎస్ మెషీన్ల అవసరం ఉండదని  నీతి ఆయోగ్  సీఈఓ అమితాబ్ కాంత్  అభిప్రాయపడ్డారు. యూత్ ప్రవాసీ భారతీయ దివస్‌ 2017లో బాగంగా నిర్వహించిన సెషన్‌లో ప్రసంగించిన కాంత్, ప్రతి భారతీయుడూ కేవలం తన బొటనవేలిని, మొబైల్ ఫోన్‌ ద్వారా అన్ని లావాదేవీలు జరుపుతున్న నేపథ్యంలో ఇక కార్డులు   వ్యర్థంగా మారిపోతాయని  పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల, డిజిటల్ చెల్లింపులు భారీ స్థాయిలో జరుగుతాయని, ప్రపంచంలోనే వందకోట్ల (బిలియన్) మొబైల్ కనెక్షన్లు, వందకోట్ల బయోమెట్రిక్‌లను కలిగిన ఏకైక దేశంగా భారత్ అవతరించిందని కాంత్ పేర్కొన్నారు. ఇటీవల విడుదల భీమ్ యాప్ , ఆధార్ ఆధారిత సేవలను గుర్తు చేశారు.



సాంకేతికంగా శరవేగంగా జరుగుతున్న మార్పులు, డిజిటల్ చెల్లింపుల పురోగతి కారణంగా మరో మూడేళ్లలోనే భారత్‌లో ఏటీఎంలు, క్రిడిట్ కార్టులు అదృశ్యం కానున్నాయని చెప్పారు.  ద్రవ్య సాంకేతికత మరియు సామాజిక ఆవిష్కరణల పరంగా భారత్ శరవేగంగా మార్పులకు గురికానుందని, ఈ నేపథ్యంలో వచ్చే రెండున్నరేళ్ల కాలంలోనే భారత్‌లో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పీఓఎస్ మెషీన్లు  దండగే అని చెప్పారు. ఆదార్ కార్డ్ ఆధారిత టెక్నాలజీ వల్ల ప్రతి లావాదేవీ కూడా కేవలం 30 సెకన్లలో పూర్తవుతుందన్నారు.



దేశంలోఇంతవరకు 85శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతుండగా, దేశంలో అతికొద్దిమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని అందుకే డిజిటల్ లావాదేవీలు, నియత ఆర్థిక వ్యవస్థను రూపొందిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చట్టబద్ధంగా రెండు లక్షల కో్ట్ల డాలర్లు చలామణిలో ఉంటూ మరొక లక్ష కోట్ల డాలర్లు అనియతరంగంలో నల్ధ ఆర్థిక వ్యవస్థగా ఉంటున్న స్థితిలో భారత్ పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే అసాధ్యమన్నారు. ఇలాంటి నేపథ్యంలో భారత్ అభివృద్ధి చెందడమే సాధ్యం కాదని చెప్పారు.


వ్యాపార సరళీకరణలో ప్రభుత్వం  చేపట్టిన  వివిధ సంస్కరణలు ఎఫ్ డీఐ వృద్ధికి దారితీసిందన్నారు.   దేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి, ఉద్యోగ సృష్టిలో ప్రభుత్వ కృషిని ఆయన నొక్కి చెప్పారు. యూరోప్, అమెరికాలో  జనాభా పెద్దవాళ్ల సంఖ్య పెరుగుతోంటే, మనదేశంలో మాత్రం యువత సంఖ్య బాగాపెరుగుతూ ఉండడం అతిపెద్ద సాంఘిక, ఆర్థిక అద్భుతమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ వృద్ధి రేటు 7.6 శాతంతో కొనసాగడం గమనించాలన్నారు. అభివృద్ధిలో  కుంటుపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఇప్పటికీ ఒయాసిస్‌గానే ఉందని నీతి అయోగ్ సీఈఓ అభిప్రాయపడ్డారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top