ఊరి మధ్య కూలిన విమానం

ఊరి మధ్య కూలిన విమానం


116 మంది దుర్మరణం.. ఇండోనేసియాలో దుర్ఘటన  టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలిన వాయుసేన విమానం

అందులో 12 మంది సిబ్బంది,

101 మంది ప్రయాణికులు




మేడన్: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ సి-130 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే మేడన్ పట్టణం మధ్యలో కూలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 116 మంది దుర్మరణం చెందారు. విమానంలో 12 మంది సిబ్బందితోపాటు 101 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరంతా చనిపోయారని అధికారులు తెలిపారు. విమానం కూలిన ప్రాంతంలో మరో ముగ్గురు చనిపోయిట్లు వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమానం వైమానిక దళానికి 51 ఏళ్ల నుంచి సేవలందిస్తోంది. విమానం కూలిన ప్రాంతంలో ఆపార్ట్‌మెంట్,  మసాజ్ సెంటర్, చిన్న హోటల్ ఉన్నాయి. ఈ భవనాలతోపాటు పలు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.అంతా క్షణాల్లోనే..: ‘విమానం మధ్యాహ్నం 12.08 గంటలకు మేడన్‌లోని సైనిక స్థావరం నుంచి టేకాఫ్ అయింది. ఆ తర్వాత రెండు నిమిషాల్లోనే 5 కి.మీ. దూరంలో జనావాసాల మధ్య కూలిపోయింది. ఇంజిన్‌లో సమస్య వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చు.



విమానంలో 12 మంది సిబ్బంది, 101 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు 49 మృతదేహాలను వెలికితీశాం’ అని ఎయిర్‌ఫోర్స్ అధినేత ఆగస్ సుప్రియాత్న తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో ఎక్కువ మంది భద్రతా బలగాల్లో పనిచేస్తున్నవారు, వారి కుటుంబీకులే ఉన్నారు. ‘విమానం ఎయిర్‌పోర్టు నుంచి గాల్లోకి లేవగానే అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. తర్వాత దాన్నుంచి పొగలు వచ్చాయి. చూస్తుండగానే కుప్పకూలిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. విమానం చాలా తక్కువ ఎత్తు నుంచే దూసుకుపోవడంతో భయకంపితులమయ్యామని మరొకరు తెలిపారు. సుమత్రా దీవుల్లో ఉన్న మేడన్ పట్టణంలో రెండు లక్షల మంది నివాసం ఉంటున్నారు. ప్రమాదం పట్ల ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదాల నుంచి మనల్ని ఆ దేవుడు రక్షించాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top