పంచాంగకర్తల్లో ఏకాభిప్రాయం సాధ్యమే!


రాజమహేంద్రవరం: పండుగలు, ముఖ్య క్రతువుల తేదీల విషయంలో చాలా ఏళ్లుగా అస్పష్టత కొనసాగుతున్నది. ఇటీవల కృష్ణా పుష్కరాల సందర్భంలో ఈ తేదీల పంచాయితీ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. కాగా ఇలాంటి అస్పష్టతకు తెరదించుతూ, ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా పండుగలు జరుపుకునేలా తేదీలను ప్రకటించాల్సిన బాధ్యత తమపై ఉందని పండితులు గుర్తించారు.



ఈమేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భిన్న పంచాంగ గణిత–ధర్మశాస్త్రాలపై ఆదివారం​ జరిగిన సమన్వయ సదస్సులో పలువురు పంచాగకర్తలు ఉమ్మడి అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రముఖ ఖగోళ, జ్యోతిష విద్వాంసుడు వరాహమిహిరుడు సూచించిన సవరణలను అమలులోకి తీసుకురాగలిగితే పండుగుల తేదీలపై పంచాంగకర్తలలో ఏకాభిప్రాయాన్ని తీసుకురావచ్చునని అభిప్రాయపడ్డారు. మహామహోపాధ్యాయ దివంగత మధుర కృష్ణమూర్తి స్ధాపించిన విశ్వవిజ్ఞాన ప్రతిష్ఠానం, జ్యోతిష విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు పంచాంగకర్తలు పాల్గొన్నారు.



రవి గతిలో ఏటా మూడు నిమిషాల 24 సెకన్ల వేగం పెరుగుతున్నదని వరాహమిహిరుడు పేర్కొన్నదానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటే పండుగలు, సంక్రమణలు మొదలైన విషయాలలో తేడాలు సమసిపోవచ్చునన్న సదస్సు కన్వీనర్‌ మధుర ఫాలశంకరమూర్తి శర్మ మాటలతో మెజారిటీ పంచాంగకర్తలు ఏకీభవించారు. విజయవాడకు చెందిన దైవజ్ఞ పుచ్చా శ్రీనివాసరావు నిర్వహించిన ఈ సదస్సుకు మహామహోపాధ్యాయ, సాంగవేద భాష్య విశారద డాక్టర్‌ చిర్రావూరి శ్రీరామశర్మ అధ్యక్షత వహించారు. విశ్రాంత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.టి.కె.రంగాచార్యులు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి తనయుడు, పంచాంగకర్త మధుర ఫాలశంకరమూర్తి శర్మలు పర్యవేక్షకులుగా వ్యవహరించారు.



పంచాంగకర్త గొడవర్తి సంపత్‌కుమార్‌ అప్పలాచార్య ‘వరాహమిహిరుని కాలంనుంచి పంచాంగముల చరిత్ర’, తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన పంచాగకర్త తంగిరాల వేంకట కృష్ణప్రసాద్, శ్రీశైల దేవస్ధానం ఆస్ధాన పంచాంగకర్త బుట్టే వీరభద్రదైవజ్ఞలు దృక్‌ పద్ధతి అనే అంశంపై ప్రసంగించారు. కంచి పీఠ పంచాంగకర్త లక్కావఝుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి, తంగిరాల వేంకట మల్లికార్జున శర్మ, నిమ్మకాయల ప్రసాద్‌ తదితరులు ప్రసంగించారు. శైవ–వైష్ణవ ధర్మశాస్త్రవిషయాలపై మధ్యాహ్నం జరిగిన ప్రసంగాలలో రాజ్యలక్ష్మి మహిళా కళాశాల సంస్కృత ఉపన్యాసకుడు అప్పల శ్రీనివాసశర్మ, పంచాంగకర్త తంగిరాల వేంకట సుబ్రహ్మణ్య ఫాల భాస్కరశర్మ, హైదరాబాద్‌కు చెందిన పూర్వ పంచాంగకర్త గుదిమళ్ళ యతీంద్ర ప్రణవాచార్యులు, గూడవర్తి సూర్యకుమార్‌ శర్మ, ఆగమాచార్య ఎం.ఆర్‌.వి.శర్మలు పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top