అమెరికా చదువులా.. ఎందుకులే!

అమెరికా చదువులా.. ఎందుకులే! - Sakshi


అక్కడి వర్సిటీలకు తగ్గిన ఆసియా దేశాల దరఖాస్తులు

► ఆసియా యువకుల ఆశలపై ఆంక్షల నీళ్లు

► గణనీయంగా తగ్గుతున్న దరఖాస్తులు

► తాజా సర్వేలో వెల్లడి




అమెరికాలో ఉద్యోగానికి జారీచేసే వీసాలపై ఆంక్షలు, కొన్ని దేశాల పౌరుల రాకను నిషేధించే చట్టాలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అక్కడి యూనివర్సిటీల్లో చదవడానికి ఆసియా దేశాల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గుతోంది. ఈ విషయం అమెరికాలోని 250 కాలేజీలు, విశ్వవిద్యాలయాలపై  గత నెల జరిపిన సర్వేలో తేలింది. 2017 సెప్టెంబర్‌లో క్లాసులు మొదలయ్యే కోర్సుల అప్లికేషన్లు చూస్తే ప్రతి పది అమెరికా కాలేజీల్లో నాలుగింటికి ఈసారి తక్కువ వచ్చాయని ఈ సర్వే చెబుతోంది. అమెరికాలో ప్రతి సెప్టెంబర్‌లో మొదలై, దాదాపు 13 వారాల పాటు సాగే మొదటి సెమిస్టర్‌తో ప్రారంభమయ్యే కోర్సులకు ఏడాది ముందు నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ఆరంభమౌతుంది.


కాలేజీ బోర్డ్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సహా ఆరు ఉన్నత విద్యా గ్రూపులు ఈ సర్వే నిర్వహించాయి. అమెరికా యూనివర్సిటీలు, కాలేజీల్లో చదవడానికి పెద్ద సంఖ్యలో చైనా, భారత్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా వంటి దేశాల యువకులు వెళ్లడం గత 16 ఏళ్లలో 72 శాతం పెరిగింది. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ రిజిస్ట్రార్స్, అడ్మిషన్‌ ఆఫీసర్స్‌ ఆధ్యర్యంలో నిర్వహించిన ఈ సర్వేలో ఇంకా నాఫ్సా–అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేటర్స్, నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ కాలేజ్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ తదితర సంస్థలు పాల్గొన్నాయి. 40 శాతం కాలేజీలకు తగ్గినా –36 శాతం సంస్థలకు అప్లికేషన్లు పెరిగాయి



ఆసియా దేశాల నుంచి తగ్గిన దరఖాస్తులు

ఈ సర్వేలో పాల్గొన్న 250 విద్యాసంస్థల్లో దాదాపు 40 శాతం కాలేజీలు, వర్సిటీలు తమకు విదేశాల నుంచి వచ్చే దరఖాస్తులు తగ్గాయని చెప్పగా, 35 శాతం సంస్థలు మాత్రం పెరిగాయని తెలిపాయి. అప్లికేషన్ల సంఖ్యలో మార్పు లేదని మరో 26 శాతం సంస్థలు వివరించాయి. చైనా నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు దరఖాస్తులు తగ్గాయని 25 శాతం సంస్థలు తెలుపగా, గ్రాడ్యుయేట్‌ కోర్సులకు కూడా తగ్గిపోయాయని 32 శాతం వర్సిటీలు వెల్లడించాయి. ఇండియా నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు దరఖాస్తులు తగ్గాయని 26 శాతం సంస్థలు చెప్పగా, గ్రాడ్యుయేట్‌ అప్లికేషన్లు మందగించాయని 15 శాతం సంస్థలు తెలిపాయి.


ఇటీవల చైనా, నేపాల్, భారత్‌లో విద్యార్థులకు వీసాల నిరాకరణ కేసులు పెరగడం, అమెరికా వర్సిటీల్లో చదువు పూర్తయ్యాక ఉద్యోగావకాశాలు, స్వదేశాలకు వెళ్లి అమెరికా తిరిగొచ్చాక ఇబ్బందులు ఎదురవుతాయనే భయాందోళనలు, విద్య, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులను పూర్వంలా ఆదరించే పరిస్థితి లేదనే భావన, అమెరికాలో ప్రవేశానికి ఆంక్షలు ప్రకటించిన దేశాల జాబితాను పెంచే ప్రమాదం ఉందనే అంచనా–ఇవన్నీ అమెరికాలో చదువుకోవాలనే ఆసియా యువకుల ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఇది హడావుడిగా చేసిన ఆన్‌లైన్‌ సర్వే. సవివరంగా చేసే అధ్యయనం ఫలితాలు మార్చి ఆఖరులో ప్రకటిస్తారు.



మన ఫీజుతో అక్కడి వాళ్లకు సబ్సిడీ

అమెరికా స్కూళ్లలో చదువుకునే విదేశీ విద్యార్థుల కారణంగా అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఏటా 3000 కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. 3,73,300 ఉద్యోగాలు (టీచింగ్‌–నాన్‌ టీచింగ్‌) వచ్చాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో స్థానికులైన అమెరికన్‌ విద్యార్థులతో పోల్చితే విదేశీ విద్యార్థులు మూడు రెట్లు ఎక్కువ బోధనా రుసుం చెల్లిస్తున్నారు. 2015లో ఈ ప్రభుత్వ యూనివర్సిటీలకు 900 కోట్ల డాలర్లు ట్యూషన్‌ ఫీజు రూపంలో అందాయి. ఈ సొమ్ముతోనే స్థానికులకు సబ్సిడీపై విద్య అందుబాటులోకి వచ్చింది. ఈ సర్వేల్లో వెల్లడైన విషయాలే వచ్చే సెప్టెంబర్, 2018 జనవరి అడ్మిషన్ల నాటికి వాస్తవాలుగా మారితే, అమెరికా విద్యారంగం, ఆర్థిక వ్యవస్థ– రెండూ తీవ్ర సంక్షోభంలో పడతాయి.


- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top