ఫేస్‌బుక్‌కు చెమటలు పట్టించిన అరుణ్‌!

ఫేస్‌బుక్‌కు చెమటలు పట్టించిన అరుణ్‌! - Sakshi


అరుణ్‌ ఎస్‌ కుమార్‌ అందరిలాగే ఓ సాదాసీదా కుర్రాడు. కానీ అతన్ని ఫేస్‌బుక్‌ స్వయంగా కాలిఫోర్నియాలోని తన ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి రూ. 21.31 లక్షల (32వేల డాలర్ల) నజరానా అందజేసింది. అరుణ్‌ చేసిందల్లా ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టిన ఓ ప్రొడక్ట్‌లో సాంకేతిక లోపాలను గుర్తించడమే. అతని ప్రతిభతో విస్తుపోయిన ఫేస్‌బుక్‌ పిలిచి మరీ బహుమానాన్ని ఇచ్చింది.



కేరళకు చెందిన అరుణ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ నాలుగో సంవత్సరం విద్యార్థి. చిన్న వ్యాపారుల వాణిజ్యప్రకటనల కోసం ఫేస్‌బుక్‌ రూపొందించిన ప్రొడక్ట్‌లో సాంకేతిక లోపాల(బగ్స్‌)ను గుర్తించడం ద్వారా అతని దిశ తిరిగిపోయింది. 'ఒక విద్యార్థిగా ఇది నాకు పెద్దమొత్తమే' అంటున్నాడు అరుణ్‌ తాను అందుకున్న నజరానాపై. తన సాంకేతిక ప్రతిభను చాటుకున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌ కంపెనీ నుంచి భవిష్యత్తులో తనకు ఉద్యోగ ఆఫర్‌ కూడా రావొచ్చునని అతను ఆశిస్తున్నాడు.



అరుణ్‌ కాదు కేరళలో చాలామంది ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. కంప్యూటర్‌ దిగ్గజాల సాఫ్ట్‌వేర్లలో లోపాలను వెలికితీసి.. అవి మరింతగా మెరుగుపడేందుకు సహాయపడుతున్నారు. దీనివల్ల పెద్దమొత్తంలో నగదు బహుమానాలు అందుకోవడమే కాదు.. తమకు నచ్చిన ప్రతిష్టాత్మక కంపెనీల దృష్టిలో పడి ఉద్యోగాలు కూడా పొందొచ్చునని భావిస్తున్నారు.



'కేరళలో చాలామంది యువకులు ఇప్పుడు ఇదే దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త టెక్నాలజీస్‌తో పరిచయం ఉండటంతో ఇందులో రాణించడం వారికి సులభంగా మారింది. బగ్స్‌ కనుగొనడం ద్వారా నేను మూడు-నాలుగు నెలల్లోనే రూ. 20 లక్షల వరకు సంపాదించాను' అని హేమంత్‌ జోసెఫ్‌ గర్వంగా చెప్తున్నాడు. కేరళ పోలీసులు కూడా సైబర్‌ నేరాలను నియంత్రణలో యువత సాయాన్ని తీసుకుంటున్నారు. సైబర్‌ ప్రపంచంలో ప్రతి సమస్య కొత్తదే.. కానీ ఇలాంటి సంక్లిష్ట సాంకేతిక సమస్యల్ని యువకులు చిటికెలో పరిష్కరిస్తున్నారని కేరళ సీనియర్‌ పోలీసు అధికారి మనోజ్‌ అబ్రహం తెలిపారు. సైబర్‌ నేరాల నియంత్రణ కోసం సైబర్‌డోమ్‌ స్టూడెంట్‌ వింగ్‌ను ఏర్పాటుచేశామని, ఇది చాలా బాగా పనిచేస్తున్నదని ఆయన చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top