అన్నీ ఇస్తాం.. హోదా తప్ప: జైట్లీ

అన్నీ ఇస్తాం.. హోదా తప్ప: జైట్లీ - Sakshi


ప్రత్యేక హోదాపై చేతులెత్తేసిన కేంద్రప్రభుత్వం

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు చాలా సాయం చేస్తున్నాం

విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం

ప్రత్యేక హోదా చట్టంలో లేదు.. ప్రధాని ప్రసంగంలో మాత్రమే

ఎన్డీసీ సూచనల ప్రకారమే హిమాచల్ ప్రదేశ్కు ప్రత్యేకహోదా

పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని నిర్మాణానికి నిధులిస్తున్నాం

ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చకు అరుణ్ జైట్లీ సమాధానం

కాంగ్రెస్ అసంతృప్తి.. సభ నుంచి వాకౌట్

బిల్లుపై ఓటింగ్ లేకుండానే చర్చ ముగింపు




న్యూఢిల్లీ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం తప్ప అన్నింటినీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన దాని కంటే చాలా ఎక్కువ మొత్తంలో నిధులు ఇస్తున్నామని, పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు ఇస్తూనే ఉంటామని, విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ అమలు చేస్తున్నామని, ఇప్పటికే చాలా సంస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రెండు రోజుల చర్చ అనంతరం అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. కానీ జైట్లీ సమాధానంతో తాము అసంతృప్తి చెందామన్న దిగ్విజయ్ సింగ్.. తమ పార్టీ సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. చివరకు ఈ బిల్లుపై ఓటింగ్ లేకుండానే చర్చను ముగించారు.



విభజనకు ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా పరిపుష్టంగా ఉండేదని, విభజన తర్వాత హైదరాబాద్ నగరంతో పాటు ప్రధానమైన సంస్థలు, పరిశ్రమలు అన్నీ తెలంగాణకు వెళ్లిపోవడంతో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థికలోటులో మునిగిపోయిందని అరుణ్ జైట్లీ తన సమాధానంలో చెప్పారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా సమయం పడుతుందని, రాష్ట్రానికి కేంద్రం ఎంతవరకు సాయం చేయగలదో అంతవరకు తప్పకుండా చేస్తుందని చెప్పారు.



గతంలోనూ కొన్ని రాష్ట్రాలను విభజించారని చెబుతూ పంజాబ్ రాష్ట్రం హర్యానా, హిమాచల్ ప్రదేశ్లుగా విభజనకు గురైందని, అలాగే వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశామని, ఆ సమయంలో అసెంబ్లీలలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారని, ఏకాభిప్రాయంతోనే ఆ విభజన చేశారని జైట్లీ చెప్పారు. దానివల్ల అక్కడ సమస్యలు పెద్దగా రాలేదన్నారు. హైదరాబాద్ నగరం చాలా కీలకమైనదని, విభజనలో భాగంగా అది తెలంగాణకు వెళ్లిందని, దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని కోల్పోయిందని అన్నారు. అయినా దీర్ఘకాలంలో చూస్తే ఏపీ రాష్ట్రం కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పాలన, ప్రణాళిక ఉంటే, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఉంటే రెవెన్యూ లోటు నుంచి కూడా బయటపడుతుందన్నారు.



ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలన్నింటినీ పూర్తిచేస్తుందని.. ఈ రాష్ట్రం కూడా ముందుకెళ్లాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంలో కొంత భాగం రాష్ట్రాలకు కూడా వెళ్తుందని, అయితే చాలా పథకాలు అమలుచేయాల్సి రావడం వల్ల ఇప్పటికే 3.9 శాతం లోటు ఉంటోందని తెలిపారు. దానివల్ల అప్పులు కూడా ఎక్కువవుతున్నాయన్నారు. యూపీఏ అయినా, ఎన్డీయే అయినా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని, దాని ప్రకారమే రాష్ట్రాలకు నిధులివ్వాలని అన్నారు. ఆర్థిక సంఘం ప్రతి ఐదేళ్లకు పరిస్థితి సమీక్షించి, రాష్ట్రాలకు కేంద్రం ఎలా సాయం చేయాలో చెబుతుందని, ఈ సంఘం కొన్ని రాష్ట్రాల పరిస్థితిని ప్రత్యేకంగా చూస్తుందని తెలిపారు. సమైక్యాంధ్రలో రెవెన్యూ మిగులు ఉండేదని, కానీ విభజన వల్ల తెలంగాణకు నిధుల అందుబాటు ఎక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం అయిపోయిందని జైట్లీ చెప్పారు. దానివల్లే చాలామంది సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. కొత్త రాష్ట్రాన్ని సృష్టించేటపుడు దాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయాలని.. కానీ విభజన చట్టంలో చూసినా, నాటి ప్రధాని ప్రసంగంలో చూసినా కొత్త రాష్ట్రానికి చాలా హామీలు గుప్పించారని అన్నారు. ఆ హామీలన్నింటినీ ప్రస్తావిస్తూ.. అన్నింటినీ నెరవేర్చినట్లు చెప్పారు. కేంద్రం నెలకొల్పాల్సిన సంస్థలన్నింటినీ నెలకొల్పుతున్నామని, ఇప్పటికే కొన్ని పనిచేస్తున్నాయని తెలిపారు. చట్టంలో ఇలా చాలారకాల హామీలు ఇచ్చారని, తర్వాత ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు.



ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు చాలాసార్లు పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించారని, నాబార్డు ఆ ప్రాజెక్టుకు కావల్సిన నిధులన్నీ ఇస్తుందని తెలిపారు. దానికి తోడు, 8 ప్రాజెక్టులకు తమ వాటాగా ఇవ్వాల్సిన 600 కోట్లు ఇప్పటికే కేటాయించామన్నారు. అందుబాటులో ఉన్న నిధుల ప్రకారం హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని.. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, రాయలసీమకు వరుసగా నిధులు ఇస్తున్నామని అన్నారు. రెవెన్యూ లోటు విషయంలో రాష్ట్రం ఒక మొత్తం చెబుతోందని.. కేంద్రం దాన్ని పరిశీలిస్తోందని, అంచనాలో కొన్ని తేడాలున్నాయని ఆయన అన్నారు.



వెనకబడిన ప్రాంతాల గ్రాంటు ఇస్తూనే ఉన్నామని.. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ. 2050 కోట్లు ఇచ్చామని, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం నేరుగా 850 కోట్లు ఇచ్చిందని తెలిపారు. పన్ను రాయితీల విషయానికొస్తే తాను బడ్జెట్లో రెండు రకాల రాయితీలు ప్రకటించానని గుర్తుచేశారు. కానీ ఆ రాయితీలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఆయన అన్నారు. ఒక రాష్ట్రానికి రాయితీలు ఇస్తే, రెండో రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఆ రాష్ట్రానికి తరలి వెళ్లిపోతాయని అభ్యంతరం చెప్పారని జైట్లీ విమర్శించారు.



ప్రత్యేక హోదా అంటే.. కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్రాల వాటా 10 శాతం అవుతుంది, కేంద్రం 90 శాతం ఇస్తుందని చెప్పారు. మామూలుగా అయితే కొన్ని పథకాలకు 100 శాతం, మరికొన్నింటికి 70 శాతం కేంద్రం ఇస్తుందని, సాధారణ రాష్ట్రాలకు 60 శాతం కేంద్రం ఇస్తే 40 శాతం రాష్ట్రాలు భరిస్తాయని అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఎలా నిధులివ్వాలో రాజ్యాంగంలోని 280వ అధికారణంలో ఉంటుందన్నారు. ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చెబుతుందని ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో ప్రత్యేక పరిస్థితి ఉండటం వల్ల వాటికి ముందుగానే హోదా ఇచ్చారని, ఉత్తరాఖండ్ రాష్ట్రం కొండమీద ఉంటుంది కాబట్టి దానికి ఇవ్వాలని ఎన్డీసీ నిర్ణయించిందని.. అయితే కొత్తగా ఏర్పడినా కూడా కొండ ప్రాంతాలు కావు కాబట్టి జార్ఖండ్, ఛత్తీస్గఢ్లకు హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. బిహార్, ఒడిశా లాంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేకహోదా కావాలంటున్నాయని తెలిపారు. అందరికీ 42 శాతం నిధులు వస్తాయి, ప్రత్యేక హోదా ఉన్నవారికి మరికొంత అదనంగా వెళ్తుందని అన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం సమైక్యాంధ్రకు 1,10,725.82 కోట్లు వచ్చిందని.. ఇప్పుడు ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 58 శాతం అంటే.. 64,575.30 కోట్లు రావాలి గానీ.. ఇప్పుడు మార్చిన లెక్కల ప్రకారం 2 లక్షల కోట్లు వెళ్తున్నాయని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం ప్రతి రాష్ట్రానికి 42 శాతం నిధులు వస్తాయి గానీ బెంగాల్‌, కేరళ, ఏపీ అదనపు నిధులు పొందుతున్నాయని తెలిపారు. మనది సమాఖ్య వ్యవస్థ అయినందున ఆంధ్రప్రదేశ్ సహా వెనకబడిన రాష్ట్రాలన్నింటినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉంటుందని, ఆ మేరకు కేంద్రం తరఫు నుంచి చేయగలిగిన సాయం అంతా చేస్తామని జైట్లీ అన్నారు.



కాంగ్రెస్ అసంతృప్తి.. వాకౌట్

ప్రైవేటు సభ్యుడి బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానంతో అసంతృప్తి చెందినట్లు కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆర్థికలోటు తీర్చడానికి రెండు చిన్నపాటి రాయితీలు ఇచ్చినా, వాటివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. ఈ సభలో ప్రధాని హామీ ఇవ్వడమే కాదు, కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుందని..  ఆ నిర్ణయం ఇప్పుడు అమలువుతుందా కాదా, కేంద్రసాయం విషయంలో కూడా ఏపీకి వెళ్లే వాటా కొండ ప్రాంతాలకు వెళ్లేంత ఉండాలని అవి చేస్తారా.. చెయ్యరా అని ప్రశ్నించారు. ఆయన ఆశించిన సమాధానాలు రాకపోవడంతో.. సభ నుంచి తమ పార్టీ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే బిల్లు ప్రవేశపెట్టిన కేవీపీ రామచంద్రరావు సహా కాంగ్రెస్ సభ్యులంతా వాకౌట్ చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top