గల్ఫ్‌ ఏజెంట్లలో వణుకు

గల్ఫ్‌ ఏజెంట్లలో వణుకు - Sakshi


రాజన్న సిరిసిల్ల జిల్లాలో 66 మంది ఏజెంట్ల అరెస్ట్‌



సిరిసిల్ల: అరచేతిలో స్వర్గం చూపించి నిరుద్యోగ యువతను గల్ఫ్‌ దేశాలకు పంపించే ఏజెంట్ల గుండెల్లో వణుకు మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పక్షం రోజుల్లో 66 మందిని జిల్లా పోలీసులు అరెస్ట్‌లు, బైండోవర్లు చేశారు. ట్రావెల్‌ ఏజెన్సీలపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహించి నకిలీ దందాకు ఉచ్చు బిగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా వంద మందికిపైగా అనధికారిక గల్ఫ్‌ ఏజెంట్లు ఉన్నారు. ముంబై, హైదరాబాద్‌ కేంద్రాలుగా వీరు గల్ఫ్‌ దేశాలకు కార్మికులను పంపిస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అనుమతి పొందిన ఏజెంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు ఉండగా.. వారి అధీనంలో అనధికారిక ఏజెంట్లు వందలాది మంది ఉన్నారు.



గల్ఫ్‌ దేశాల్లోని వివిధ కంపెనీల వీసాలను రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి ధరలను పెంచి అంటగడుతున్నారు. దుబాయికి చెందిన పేరున్న కంపెనీ వీసా అన్ని ఖర్చులు కలుపుకొని రూ. 30వేలు ఉంటే.. దాన్ని రూ. 50 నుంచి రూ.60వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు గల్ఫ్‌ దేశాల్లో చేయాల్సిన పనిని చెప్పకుండా హోటల్‌లో పని అని, గార్డెన్‌లో, పెట్రోల్‌ బంకుల్లో, విమానాశ్రయాల్లో, కంపెనీల్లో సెక్యూరిటీ గార్డు, ఇంటి కారు డ్రైవర్‌ అంటూ సులభమైన పనిని చెప్పి పంపిస్తున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి అధికవడ్డీలకు అప్పులు చేసి వెళ్తున్న యువ కులు తీరా అక్కడికి వెళ్లాక మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమంటున్నారు.



సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా సుమారు 25వేల మంది యువకులు గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏజెంట్‌ చేసిన మోసంతో ఇంటికి రాలేక.. అక్కడే ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. గల్ఫ్‌బాటలో ఏజెంట్ల మాటలే కీలకంగా మారాయి. అలాంటి ఏజెంట్లపై సిరిసిల్ల జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లావ్యాప్తంగా 66 మంది ఏజెంట్లను పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకుని అరెస్ట్, బైండోవర్‌ చేశారు. అన్ని మండలాల్లోనూ ఇంకా అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. అంతేకాకుండా పోలీసులు గ్రామాల వారిగా వివరాలు సేకరించి వారిపై నిఘా ఉంచారు.



దుబాయ్‌ వెళ్లి వచ్చిన మంత్రి కేటీఆర్‌

వలస జీవుల కష్టాలను విన్న సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రవాసీ తెలంగాణ శాఖ మంత్రి కె.తారకరామారావు మంత్రి హోదాలో దుబాయ్‌ వెళ్లి పరిశీలించారు. గుర్తింపు లేని ఏజెన్సీలు, విజిటింగ్‌ వీసాలపై వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. తెలంగాణలో గల్ఫ్‌ వలసజీవుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చేందుకు చర్యలు తీసు కుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తం గా పోలీసు దాడులు జరగడం విశేషం.  గల్ఫ్‌ బాటలో మోసాలను అరికట్టే పక్రియకు సిరిసిల్ల నుంచే శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.



ఇరాక్‌లో ఉన్న రాష్ట్ర కార్మికులకు సుష్మా భరోసా  

మోర్తాడ్‌: ఇరాక్‌లో ఇక్కట్లు పడుతున్న రాష్ట్ర కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగశాఖ సానుకూలత వ్యక్తం చేసింది. ఇరాక్‌లోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది కార్మికులున్నారు. వారిని కంపెనీ వీసాలపై కాకుండా విజిట్‌ వీసాలపై ఏజెంట్లు ఇరాక్‌కు పంపించారు. వీసాల గడువు ముగియ డంతో వారికి ఇరాక్‌లోని కంపెనీలు పని ఇవ్వడం లేదు.  దీంతో కార్మికులు ఇరాక్‌లో ఉండలేమని ఎలాగైనా ఇంటికి చేరుకోవా లని ఆశిస్తున్నారు. అయితే విజిట్‌ వీసా గడువు ముగిసి పోవడంతో కార్మికులు ఇంటికి వెళ్లాలంటే జరిమానా చెల్లించాలని ఇరాక్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాక్‌ వెళ్లడానికి అప్పు చేసిన తాము మళ్లీ ఇంటికి రావడానికి అప్పు చేయాల్సి రావడంతో కార్మికుల పరిస్థితి దిక్కుతోచకుంది.



ఈ క్రమంలో అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్న జన్నారం వాసి కొమురయ్య ఎప్పటికప్పుడు తెలంగాణ గల్ఫ్‌ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బసంత్‌రెడ్డికి సమాచారం అందిస్తు న్నారు. బసంత్‌రెడ్డి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ద్వారా కార్మికుల ఇబ్బందులను విదేశాంగ శాఖకు విన్నవించారు. వీరి చొరవ వల్ల 33 మంది ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా వందలాది మంది కార్మికులు ఇరాక్‌లో ఉన్నారని విదేశాంగ శాఖకు బసంత్‌రెడ్డి సమాచారం ఇవ్వడంతో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందించారు.  జరిమానా చెల్లించ కుండా ఇళ్లకు చేర్పించడానికి చర్యలు తీసు కుంటామని సుష్మా స్వరాజ్‌ ట్వీటర్‌ ద్వారా తెలిపారు. ఇరాక్‌లో ఉన్న కార్మికులు బాగ్దాద్‌ లోని రాయబార కార్యాలయంలో సంప్ర దించాలని లేదా ఎర్‌బీల్‌లోని కాన్స్‌ లేట్‌ కార్యాలయం  009647517402100 నంబర్‌ లో సంప్రదించాలని సుష్మా స్వరాజ్‌ ట్వీటర్‌లో సూచించారు.  



అనుమతి లేకుంటే చర్యలు

విదేశాలకు చట్టపరమైన అనుమతులు లేకుండా పంపించడం నేరం. ఇమిగ్రేషన్‌ యాక్టు ప్రకారం అనుమతులు తీసుకోవాలి. ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేకుండా ట్రావెల్‌ ఏజన్సీలు నిర్వహించడం చట్టవిరుద్దం. పాస్‌పోర్టులు కలిగి ఉండడం నేరం. జిల్లాలో ఏజెంట్లను మొదటి తప్పిదంగా భావించి బైండోవర్‌ చేశాం. మళ్లీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

    – విశ్వజిత్‌ కాంపాటి, జిల్లా ఎస్పీ.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top