‘అందుకే అతడిని జీప్‌కు కట్టేశా’

‘అందుకే అతడిని జీప్‌కు కట్టేశా’


శ్రీనగర్‌: ఓ వ్యక్తిని ఆర్మీ జీప్‌నకు కట్టేసినందుకు ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ నుంచి పురస్కారం అందుకున్న మేజర్‌ లీతుల్‌ గొగోయ్‌ మంగళవారం ఈ విషయంపై తొలిసారి మీడియాతో మాట్లాడారు. అనేక మందిప్రాణాలను కాపాడేందుకే తాను అతణ్ని జీప్‌నకు కట్టేశానని తెలిపారు.



కశ్మీర్‌లో ఏప్రిల్‌ 9న శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా హింస చెలరేగడం... ఆ సమయంలో ఫరూఖ్‌ అహ్మద్‌ దార్‌ అనే వ్యక్తిని ఆర్మీ మేజర్‌ లీతుల్‌ గొగోయ్‌ జీప్‌నకు ముందువైపున కట్టేసి మానవ కవచంలా వాడుకోవడం తెలిసిందే. ఆ సమయంలో 1,200 మంది ఆందోళనకారులు ఐటీబీపీ సిబ్బంది, ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందిని చుట్టుముట్టి రాళ్లు విసురుతామనీ, పోలింగ్‌ బూత్‌ను తగలబెడతామని బెదిరించారని గొగోయ్‌ తెలిపారు. తాము వెళ్లి వారందరినీ కాపాడామనీ, అప్పుడు ఫైరింగ్‌కు అనుమతించి ఉంటే కనీసం 12 మందైనా చనిపోయుండేవారని ఆయన వివరించారు.



లీతుల్‌ గొగోయ్‌ చర్యను సైనిక మాజీ అధికారులు సమర్థించారు. ‘విపత్కర పరిస్థితుల్లో గొగోయ్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. రాళ్లు విసురుతున్న ఆందోళనకారుల బారి నుంచి పౌరులు, సైనికులు, పోలింగ్‌ బూత్‌ అధికారులను కాపాడారు. ఆయనను వేలెత్తి చూపించేవాళ్లు అవమానంతో తలదించుకోవాల’ని రక్షణ రంగ నిపుణుడు పికే సెహగల్‌ వ్యాఖ్యానించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top