ఏమో గుర్రం ఎగరావచ్చు!

ఏమో గుర్రం ఎగరావచ్చు!


న్యూఢిల్లీ:'తిన్నవా, పన్నావా, తెల్లరిందా?'.. ఈ రోటిన్ జీవితం ఆయనకు బోర్ కొట్టింది. ఆయనదేమీ మధ్యతరగతి జీవితం కాదు.ఐఐటీ గ్రాడ్యువేట్. ఢిల్లీ ప్రభుత్వంలో మంచి ఉద్యోగం. చేతినిండా కాసులు. ఎక్కడికెళ్లడానికైనా కారు. పబ్ కెళ్లినా అదే తాగుడు. వారే మిత్రులు. అవే సొల్లు కబుర్లు. జీవితం బోర్..బోర్..  జీవితంలో ఏదో సాధించాలి. ఎవరికైనా ఏమైనా చేయాలి. ముఖ్యంగా విద్యార్థులకు. ఏం చేయాలి? సరిగ్గా పదేళ్ల క్రితం ఆయన మనసునను  తొలిచిన ఆలోచనలు



2008 ఒలింపిక్స్ కు భార్ హాకీ జట్టు ఎంపిక కాలేదు. బాధ పడ్డారు. సమస్య మూలాల్లోకి వెళ్లి దాన్ని పరిష్కరించాలి. హాకీలో భారత సువర్ణాధ్యయాన్ని తిరిగి రాయాలి. అందుకు చిన్న పిల్లలకు హాకీ నేర్పించాలి. వారిని భావి హాకీ రత్నాలుగా తీర్చిదిద్దాలి. అదే ధ్యేయంతో ఆర్ముగం అనే ఆ యువకుడు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. విలాసాల కులాసాలను పక్కన పెట్టారు. టీవీని చూడటం ద్వారా ఆ ఆట పట్ల తనకు కలిగిన ఆసక్తికి ఆచరణను జోడించారు. 'హాకీ సిటిజన్ గ్రూప్ పేరిట ఓ ఎన్జీవోను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. పిల్లలను సమీకరించారు. తాను ఎన్నడూ హాకీ ప్లేయర్ కాదు. హాకీ గురించి ఎంతో చదివారు. పిల్లలకు హాకీ గురించి తాను చదివిందల్లా చెప్పారు. వ్యయప్రాయాలసాలకు వోడ్చి దేశం నలుమూలల నుంచి కోచ్ లను తెప్పించి తన విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆయనకు హాకీ ఆడే శిష్యులు ఏర్పడ్డారు. దేశంలోని 24 ప్రభుత్వ పాఠశాలల్లొ ఆయనకు హాకీ టీమ్ లు ఏర్పడ్డాయి. మొత్తం 2,400 మంది శిష్యులు ఆయన లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఏర్పాటు చేసిన టీమ్ లు జిల్లా స్థాయి టోర్నమెంటుల్లో రాణిస్తుంటే ఓ ఇద్దరు రాష్ట్ర స్థాయి టీమ్ కు ఎంపికయ్యారు. ఓ ప్రవృత్తిగా చేపట్టిన జీవితంలో ఆయన రెండో ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగలేదు. ఎన్నో  ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తాను స్థాపించిన 'హాకీ సిటిజెన్ గ్రూప్'ఎన్జీవో తరుపున సాయం కోసం ఎక్కడికెళ్లినా 'ఎన్జీవో' నా అంటూ తొలుత ఛీత్కరించారు. రానురాను ఆయన అకుంఠిత దీక్షను గమనించిన పాఠశాలలు ముందుకొచ్చి ఆయనకు అండగా నిలిచాయి. హాకీకి పనికొచ్చే స్కూల్ మైదానాలను టీచర్లే పునరుద్ధరించారు. ఇప్పుడు అన్ని వర్గాల నుంచి ఆయనక అవసరమైన మేరకు విరాళాలు కూడా అందుతున్నాయి.





తన లక్ష్య సాధనకు ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు ఎన్నుకున్నారని ప్రశ్నించగా, ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ఎక్కువ. ఆట స్థలాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకో, చదువుకో అంటూ 24 గంటలు రుద్దుతాయి. ఆట స్థలాన్నవి అసలే ఉండవు'అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఆర్ముగం.. జాతీయం జట్టుకు తన విద్యార్థుల ఎంపిక కావాలని, ఆ దిశగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పారు. ఓలింపిక్స్ కు భారత హాకీ జట్టు అర్హత సాధించడం తన కలని ఆయన చెప్పారు.'ఏమో గుర్రంఎగరావచ్చు. ఆయన కల సాకారం కానూ వచ్చు!'



ఆర్ముగం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే' hockeybook@gmail.com/website'ను చూడవచ్చు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top