Alexa
YSR
‘ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం న్యూస్కథ

చల్లారిన ‘ఖాకీ’చిచ్చు

Sakshi | Updated: August 07, 2012 01:54 (IST)
India :హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల భార్యలు, పిల్లలు చేసిన ఆందోళన ఫలించింది. వారి సమస్యలు పరిష్కరించేందుకు పోలీసు శాఖ హుటాహుటిన చర్యలు చేపట్టింది. ఏపీఎస్పీ 8వ బెటాలియన్‌లో మొదలైన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా అన్ని బెటాలియన్‌లకూ వ్యాపించడంతో పోలీసు శాఖ నష్ట నివారణ చర్యలను చేపట్టింది. డీజీపీ వి.దినేష్‌రెడ్డి బాధిత కుటుంబీకులు, ఉన్నతస్థాయి అధికారులు, పోలీసు అధికారుల సంఘం నేతలతో సోమవారం భేటీ అయ్యారు. డీజీపీ కార్యాలయంలో ఉదయం 11.30గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 1.30 వరకు సాగింది. కానిస్టేబుళ్ల భార్యాపిల్లలతో మాట్లాడి ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు. భోజన విరామం అనంతరం ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతమ్ సావంగ్‌తోపాటు ఇతర అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. ఏపీఎస్పీలో నెలకొన్న సమస్యలకు దారితీసిన పరిస్థితులపై ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు పోలీసు అధికారుల సంఘం నేతలతో మరోమారు డీజీపీ సమావేశం నిర్వహించారు. ఏపీఎస్పీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల్లో పోలీసు శాఖ పరిధిలో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించి, ప్రభుత్వ జోక్యంతో పరిష్కరించాల్సిన వాటిని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఏబీసీ గ్రూపులు తొలగిస్తాం: ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య అయిన ఏబీసీ గ్రూపులను తక్షణమే తొలగించేందుకు డీజీపీ హామీ ఇచ్చారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఏపీఎస్పీ సిబ్బంది ఇబ్బందులకు గురవడానికి బాధ్యులైన రిజర్వు ఇన్‌స్పెక్టర్‌పై చర్యలకు డీజీపీ హామీ ఇచ్చినట్లు పోలీసు అధికారుల సంఘం నేతలు మీడియాకు వెల్లడించారు. గతంలో ఉన్న విధంగా నెలలో మూడు రోజులపాటు పర్మిషన్ సెలవులు ఇచ్చే చర్యలను అమలుచేయాలని ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతమ్‌సావంగ్‌ను డీజీపీ ఆదేశించారు. సుదూర ప్రాంతాలకు డ్యూటీలు వేయకుండా గతంలో ఉన్న విధంగా రేంజ్ పరిధిలోనే విధులను నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సుదూర ప్రాంతాలకు పంపిన ఏపీఎస్పీ బెటాలియన్‌లను ఆయా పరిధిలోకి రప్పించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు.

ప్రతి నెలా కుటుంబ సమావేశాలు: డీజీపీ

ఏపీఎస్పీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతినెలా ఆయా బెటాలియన్‌లలో ‘కుటుంబ సమావేశాలు’ నిర్వహిం చాలని డీజీపీ వి.దినేష్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశాల ద్వారా సిబ్బంది సమస్యలను తెలుసుకోవడంతోపాటు వారి సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించాలని స్పష్టంచేశారు. కానిస్టేబుళ్ల విధుల్లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని గౌతమ్‌సావంగ్‌ను ఆదేశిం చారు. పోలీసు సిబ్బంది సంక్షేమ నిధి ఏటా కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు యూసఫ్‌గూడ ఏపీఎస్పీ మొదటి బెటాలియన్‌లో 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎన్నడూ లేనివిధంగా యూసుఫ్‌గూడతోపాటు 12 జిల్లాల్లో పోలీస్ సెంట్రల్ క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు సరకులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.

బాధితులపై కేసులు పెట్టొద్దు: క్రమశిక్షణ కలిగిన పోలీసుశాఖలో ధర్నా, రాస్తారోకోలాంటి నిరసన కార్యక్రమాలు చేయడం, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడం వంటి చర్యలను భవిష్యత్‌లో ఉపేక్షించబోమని డీజీపీ స్పష్టంచేశారు. ప్రస్తుతం చేసిన ఆందోళనకు సంబంధించి మానవతా దృక్పథంతో ఆలోచించి ఎలాంటి క్రిమినల్ చర్యలూ తీసుకోరాదని డీజీపీ ఆదేశాలు జారీచేశారు. నాలుగో బెటాలియన్‌లో కొం దరు కానిస్టేబుళ్లపై క్రిమినల్ కేసులు పెట్టారని, ఆ కేసులను ఎత్తివేయాలని వారి కుటుంబీకులు డీజీపీకి విజ్ఞప్తిచేశారు. విధి నిర్వహణలో మృతిచెందిన పయనీ మృతికి సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. డీజీపీ దినేష్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చినందున అన్ని యూనిట్‌లలో ఆందోళనలను విరమించినట్లు పోలీసు అధికారుల సంఘం నేతలు ప్రకటించారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర నేతలు కేవీ చలపతిరావు, జీఎస్ రాజు, శ్రీనివాసరెడ్డి, రవీంద్రకుమార్ తదితరులు ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

పునరావృతం కాకుండా చూడండి: హోంమంత్రి

ఏపీఎస్పీ సిబ్బంది సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ఇలాంటి ఆందోళనలు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులను హోంమంత్రి ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతో సచివాలయంలోని తన చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో డీజీపీ వి.దినేష్‌రెడ్డి, ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతమ్‌సావంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీసుశాఖ పరిధిలో తీసుకోవలసిన నిర్ణయాలను వెంటనే తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆమె సూచించారు. ప్రభుత్వ పరిధిలో తీసుకోవలసిన నిర్ణయాలకు సంబంధించి నివేదిక అందించాలన్నారు. ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌ను తాడిపత్రి నుంచి అనంతపురానికి మార్చాలని, అర్హులైన ఏపీఎస్పీ సిబ్బందిని ఆర్మ్‌డ్ రిజర్వ్‌కు బదిలీచేయాలని, సిబ్బంది ప్రత్యేక అలవెన్స్‌లను మంజూరుచేయాలని కొన్ని ప్రతిపాదనలను డీజీపీ హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఆందోళన వెనక అరాచక శక్తులు: గౌతమ్

‘‘ఎనిమిదో ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కేంద్రంగా పోలీస్ కుటుంబాలు ఆందోళనకు దిగేందుకు అరాచక శక్తులు పురిగొల్పినట్లు గుర్తించాం. సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే ధైర్యంగా అధికారుల ముందుకొచ్చి చెప్పుకోవాలి. అలాకాకుండా వారి భార్యలతో ఆందోళన చేయిం చటం సరైంది కాదు. చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. వారికి సిగ్గనిపించకపోవటం ఆశ్చర్యకరమే. ఆందోళనలకు పురిగొల్పిన శక్తులను ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాం. పునరావృతం అయితే ఉపేక్షించ ం. కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతం సావంగ్ హెచ్చరించారు. సోమవారం ఉదయం డీజీపీ దినేష్‌రెడ్డి పోలీస్ కుటుంబాలతో జరిపిన చర్చల వివరాలను సావంగ్ మీడియాకు వివరించారు. పోలీసుల భార్యలు కోరినట్లు ఏబీసీ విధానం రద్దు, నెలలో మూడ్రోజుల అనుమతి సెలవులు, దూర ప్రాంతాల డ్యూటీల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారన్నారు. ఏపీఎస్పీ కుటుంబాల ఆరోగ్యం, విద్య, రవాణ, భద్రత వంటి అంశాలపై దృష్టి పెడుతున్నామన్నారు. ఏపీఎస్పీ సిబ్బందికి ట్రావెలింగ్ అలవెన్స్(టీఏ) కింద డబ్బులు చెల్లింస్తున్నందున.. పెట్రోల్ అలవెన్స్ రూ.200 నిలిపివేశామని, ఇందులో ఐజీ వెంకటేశ్వర్‌రావుకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ఏపీఎస్పీలో 6,700 మంది సిబ్బంది కొరత ఉన్నందునే ఏబీసీ విధానం అమలు చేయాల్సి వచ్చిందన్నారు. దీన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలని ఆదేశించారని, దీనికంటే మెరుగైన విధానంపై కసరత్తు చేస్తామని సావంగ్ చెప్పారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Sakshi Post

Pakistan National Comes To TN By Boat From Sri Lanka, Held

The Pakistani national was produced before a magistrate and remanded to judicial custody.

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC