యాపిల్‌ కంపెనీకి అతిపెద్ద షాక్‌!

యాపిల్‌ కంపెనీకి అతిపెద్ద షాక్‌! - Sakshi


బ్రసెల్స్: ఐఫోన్‌, ఐప్యాడ్‌ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులను అందించే ప్రఖ్యాత కంపెనీ యాపిల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఐర్లాండ్‌లో ఇన్నాళ్లు పన్నులు ఎగ్గొట్టడాన్ని తప్పుబడుతూ ఏకంగా 14.5 బిలియన్‌ డాలర్లు (రూ. 97,222 కోట్లు- 13బిలియన్‌ యూరోలు) జరిమానాగా చెల్లించాలని యూరోపియన్‌ యూనియన్‌ ఆదేశించింది.



తన ఉత్పత్తులపై పన్నులు చెల్లించకుండా ఉండేందుకు ఐర్లాండ్‌ ప్రభుత్వంతో యాపిల్‌ కంపెనీ చేసుకున్న ఒప్పందాలన్నీ చట్టవిరుద్ధమైనవి ఈయూ స్పష్టం చేసింది. ఈ ఒప్పందాల వల్ల ఐర్లాండ్‌లో అమ్మకాలు జరిపే తన ఉత్పత్తులపై కంపెనీ పూర్తిస్థాయిలో పన్నుమినహాయింపు పొందిందని, ఇది సరైనది కాదని పేర్కొంది.



ఇర్లాండ్‌ ప్రభుత్వం అమెరికా బహుళ జాతి కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రత్యేక పన్నుమినహాయింపులతో ఆఫర్లు గుప్పించింది. స్వీట్‌హార్ట్‌ డీల్స్‌గా పేరొందిన ఈ ఒప్పందాల కారణంగా యాపిల్‌ తన లాభాలపై ఐర్లాండ్‌ లో పన్ను మినహాయింపు పొందింది. 'యాపిల్‌ కంపెనీకి ఐర్లాండ్‌ అక్రమమైన పన్ను లబ్ధులు చేకూర్చినట్టు కమిషన్‌ దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఇలా అనుమతించడం వల్ల ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్‌ చాలా తక్కువమొత్తంలో పన్ను చెల్లించింది' ఈయూ కాంపిటేషన్‌ కమిషనర్‌ మార్‌గ్రేథె వెస్టేజర్‌ తెలిపారు.



'యాపిల్‌ కంపెనీకి ఇచ్చిన లబ్ధుల వల్ల యూరోపియన్‌ యూనియన్‌లో వచ్చిన లాభాల్లో 2003లో 1శాతం పన్ను చెల్లించగా, 2014లో కేవలం 0.005శాతం పన్ను మాత్రమే చెల్లించింది. ఇది అక్రమం' అని ఈయూ పేర్కొంది. మరోవైపు తమ దేశానికి చెందిన ప్రఖ్యాత కంపెనీ అయిన యాపిల్‌పై రూ. 97 వేల కోట్ల భారీ జరిమానా విధించడంపై అమెరికా కారాలు మిరియాలు నూరుతోంది. ఈయూ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top