ఈ సారైనా ఆర్డీఎస్‌ దశ మారేనా?

ఈ సారైనా ఆర్డీఎస్‌ దశ మారేనా? - Sakshi


- ఆధునికీకరణ పనులకు అభ్యంతరం లేదంటున్న ఏపీ

- కెనాల్‌ పనులకు సవరించిన అంచనాలకు ఓకే చెప్పిన తెలంగాణ

- పనులు చేసేందుకు అంగీకరించిన కర్ణాటక




సాక్షి, హైదరాబాద్‌:
కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌) ఆధునికీకరణ పనులను తిరిగి ప్రారంభింపజేసేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కెనాల్‌ పనులకు సంబంధించి సవరించిన అంచనాలకు ఓకే చెప్పిన ప్రభుత్వం..హెడ్‌ వర్క్స్‌ పనుల అంచనాలను కూడా సవరించే పనిలో పడింది.



ఇక ఆంధ్రప్రదేశ్‌ సైతం ఆధునికీకరణ పనులకు తమ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని, పనులు చేయాల్సిన కర్ణాటక ప్రభుత్వానికి హామీ ఇవ్వడంతో ఈ మారు పనులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రతీసారి పనులు ప్రారంభం అయిన వెంటనే అడ్డుపడుతున్న కర్నూలు జిల్లా నేతలు దీనిపై ఎలా వ్యవహరిస్తారు, ఈ సాకుతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందన్న దానిపై మాత్రం అనుమానాలున్నాయి.



పూడికతో తగ్గిన నీరు..

వాస్తవానికి ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. దీంతో పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీల మేర నీరు లభ్యమవుతోంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేరకు నీరు రావడం లేదు.  ఈ కాల్వల ఆధునికీకరణ పనులకోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72 కోట్ల మేర చెల్లించింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునికీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో 4 టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. దీంతో కేవలం 37వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే  సాగునీరందుతోంది. ఈ విషయాన్ని గతంలో కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రస్తావించగా, నిర్ణీత నీటిని తెలంగాణ వాడుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇందుకు తాము సహకరిస్తామని ఏపీ స్పష్టం చేసింది. ఈ హామీ మేరకు గత ఏడాది పనులు ఆరంభించగా, కర్నూలు జిల్లా అధికారులు, నేతలు అడ్డు తగిలారు. శాంతి భద్రతల సమస్య నేపథ్యంలో కర్ణాటక పనులు నిలిపివేసింది.



తాజాగా జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో పనులు చేసేందుకు కర్ణాటక అంగీకరించగా, ఏపీ సైతం అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో ఇక్కడ మరో పదిపదిహేను రోజుల్లో పనులు ఆరంభమవుతాయని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్యాకేజీ–1లోని హెడ్‌వర్క్స్‌ అంచనాని రూ.3కోట్ల నుంచి రూ.13కోట్లకు పెంచగా, దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఇది వచ్చిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ సైతం కొత్తగా ఏపీకి తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించిన దృష్ట్యా, ఆ నీటిని ఆర్డీఎస్‌ కుడి కాల్వ ద్వారా తీసుకో వచ్చని తెలంగాణ అంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పనులను కొనసాగించగలిగితే ఏపీకి సైతం లాభం చేకూరుతుంది. లేదంటే 2 రాష్ట్రాల్లోని ఆయకట్టుకు గడ్డు పరిస్థితి తప్పదని అంటున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top