చదువుకోరు.. శుభ్రంగా ఉండరు

చదువుకోరు.. శుభ్రంగా ఉండరు - Sakshi

ఎస్సీ, ఎస్టీలపై మంత్రి ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

 

జమ్మలమడుగు (వైఎస్సార్‌ జిల్లా): ‘దళితులు శుభ్రంగా ఉండరు.. సక్రమంగా చదువుకోరు.. వారు అభివృద్ధి చెందక పోవడానికి వారే కార ణం’ అంటూ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు ఏరి యా ఆసుపత్రి అభివృద్ధి అంశంపై చర్చించడానికి మంగళవారం సూపరింటెండెంట్‌ రామేశ్వరుడు అధ్యక్షతన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో మంత్రి మాట్లాడుతూ.. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దళితులు మారలేదు. రాజ్యాంగంలో అంబేడ్కర్‌ దళితులకు పదేళ్లు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు.



ఇప్పటికి 70 ఏళ్లు దాటినా వారిలో ఎటువంటి మార్పు రాలేదు. దళితులు అభివృద్ధి చెందకపోవడానికి దళితులే కారణం. వారికి భూముల పట్టాలు ఉండవు. వారు బాగా చదువుకోరు. శుభ్రంగా ఉండరు. అందుకే వారే ఎక్కువగా రోగాల బారిన పడుతు న్నారు’ అన్నారు. నంద్యాల ఉపఎన్నిక పూర్తి కాగానే ఈ ఆసుపత్రి చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. తాను సంకల్పించిన పనిని పట్టుబట్టి కచ్చితంగా జరిగేలా చూస్తానని, ఆ పని జరుగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. ‘విలేకరులు ఉన్నది ఉన్నట్లు రాయాలి. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు మయసభ మాదిరిగా రాయకూడదు. చిన్న వాటిని భూతద్దంలో చూపించడం సరైంది కాదు’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top