వేకువజాము నుంచే ఎక్కడికక్కడ బంద్


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం వేకువజామునే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ ప్రారంభమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో... పార్టీ శ్రేణులు తెల్లవారుజామున 3 గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో బస్సులను అడ్డుకున్నారు. షాపులను బంద్ చేయించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో 3.30 గంటల నుంచి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బస్టాండ్ నుంచి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఆర్టీసీ డిపో ముందు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బైఠాయించి బంద్ నిర్వహించాయి.



విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుంచే పట్టణ బంద్ జరిగింది. బస్సులు తిరగకుండా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిలో పార్టీ సాంస్కృతిక విభాగం నాయకురాలు వంగపండు ఉషా పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే అనంపురం జిల్లా పుట్టపర్తి బస్ డిపో ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. చిత్తూరు జిల్లా పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బంద్ నిర్వహిస్తున్నారు.



శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్సార్‌సీపీ బంద్ కారణంగా ఒడిశా, ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి. విశాఖ జిల్లా అరకులో స్వచ్చందంగా బంద్ కొనసాగుతోంది. వ్యాపారస్తులు తమకు తాముగా షాపులు తెరవకుండా బంద్ పాటిస్తున్నారు. పార్టీ శ్రేణులు రహదారిపై ధర్నాకు దిగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉదయం 4 గంటల నుంచే బంద్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అంజద్, మేయర్ సురేష్ తదితరులు బంద్‌ను పర్యవేక్షించారు. ఒంగోలు ఆర్టీసీ డిపో వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి. గుంటూరు, తిరుపతి ఆర్టీసీ బస్ డిపోల నుంచి బస్సులను బయటకు వెళ్లకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.



నేతల అరెస్ట్

అనంతపురం పట్టణంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నవీ మహ్మద్, జయరాంనాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా చోడవరంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ కారణంగా వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చోడవరం, గోవాడ, అంబేరుపురం జంక్షన్లలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో బస్సులు, ఆటోలు, లారీలు నిలిచిపోయాయి. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్యుతాపురంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో ముందు బంద్ నిర్వహిస్తున్న 53వ వార్డు పార్టీ అధ్యక్షుడు చిక్కాల రమణ, 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top